చిలుకూరు : ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి లారీ ఢీకొనడంతో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన కోదాడ–జడ్చర్ల జాతీయ రహదారిపై చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ స్టేజీ వద్ద బుధవారం జరిగింది. పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. మిర్యాలగూడ డిపోకు చెందిన పల్లె వెలుగు బస్సు హుజూర్‌నగర్ నుంచి కోదాడకు వెళ్తూ.. చిలుకూరు మండలం సీతారాంపురం గ్రామ స్టేజీ వద్ద ప్రయాణికులను ఎక్కించుకునేందు కోసం ఆగింది. అదే మార్గంలో లారీ అతివేగంగా వచ్చి బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో బస్సు, లారీ రోడ్డు పక్కకు దూసుకెళ్లాయి. ఈ ప్రమాదంలో బస్సు వెనుక అద్దాలు పగలడంతో ఎనిమిది మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. ఘటనా స్థలాన్ని కోదాడ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ జిలానీ, తహసీల్దార్ ధృవకుమార్, ఎస్‌ఐ మోహన్ పరిశీలించారు. ప్రయాణికులను కోదాడ బస్టాండ్‌కు తరలించారు. బస్సు డ్రైవర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్ తెలిపారు.
ఫ ఎనిమిది మంది ప్రయాణికులకు గాయాలు


