మోత్కూరు : పొట్టు లోడుతో వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటన మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలో మంగళవారం ఉదయం జరిగింది. మోత్కూరులోని ఓ రైస్ మిల్లులో పొట్టు లోడు చేసుకున్న ట్రాక్టర్ పనకబండ చౌరస్తా నుంచి రాజన్నగూడెం వెళ్లే రహదారి మీదుగా వెళ్తుండగా.. టెలిఫోన్ ఎక్స్ఛేంజ్ సమీపంలో గుంతలమయంగా మారిన రోడ్డులో అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. పనకబండ చౌరస్తా–రాజన్నగూడెం డబుల్ బీటీ రోడ్డు పనులు మూడేళ్లుగా అసంపూర్తిగా నిలిచిపోవడంతో రహదారి గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకయాతన పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతున్నారు.


