నల్లగొండ టూటౌన్ : తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు తెలియని సీఎం రేవంత్‌రెడ్డి విద్యా శాఖను తన దగ్గర పెట్టుకొని విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించాడని పలువురు వక్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం నల్లగొండ పట్టణంలోని లయన్స్‌క్లబ్ భవన్‌లో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు వక్తలు పాల్గొని మాట్లాడారు. ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ అంటేనే సంక్షోభం అని, 30 నెలల్లోనే అన్ని వ్యవస్థలను నాశనం చేశారన్నారు. శాసనమండలిలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సమస్యను లేవనెత్తుతానని ఆయన తెలిపారు. నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రులు హెలికాప్టర్‌లో తిరగడానికి డబ్బులు ఖర్చు పెడుతున్నారు గాని, విద్యార్థులు చదువుకునేందుకు ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలనే సోయి లేదన్నారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేష్‌రెడ్డి మాట్లాడుతూ.. ఫీజు రీయింబర్స్‌మెంట్ కేవలం విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాల సమస్య కాదని, ఇదొక సామాజిక సమస్య అన్నారు. పేద పిల్లలను విద్యకు దూరం చేసే కుట్ర జరుగుతుందని, దానిని అడ్డుకోవడానికే ఈ రౌండ్‌టేబుల్ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మూసీ ప్రక్షాళన, ఫ్యూచర్ సిటికీ లక్షల కోట్ల రూపాయలు వస్తాయి కానీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. కమిషన్లు రావు కాబట్టే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా మొండికేస్తున్నారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు చెరుకు సుధాకర్ మాట్లాడుతూ.. విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి విద్యారంగాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్నాడన్నారు. మాజీ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి మాట్లాడుతూ.. విద్యారంగానికి ఏ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వడంలేదన్నారు. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న తెలంగాణలో రూ.11,300 కోట్ల ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకపోవడం దారుణమన్నారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ.. కేసీఆర్ గురుకులాలు, మెడికల్ కాలేజీలను అద్భుతంగా తీర్చిదిద్దారని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వకుండా పేద విద్యార్థులను ఉన్నత విద్యకు దూరం చేసే కుట్ర చేస్తున్నాడని ఆరోపించారు. ఇంకా పలువురు వక్తలు మాట్లాడుతూ.. విద్యా వ్యవస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. బకాయిల విడుదల కోసం విద్యార్థులు, వారి తల్లిదండ్రులతో కలిసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వణికించేలా ఉద్యమం చేపడతామని వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, బీసీ సంఘం, ప్రజా సంఘాల నాయకులు మిర్యాల యాదగిరి, జనార్దన్‌గౌడ్, కోడూరి లక్ష్మీనారాయణ, పాలడుగు నాగార్జున, రఫీ, ప్రైవేట్ డిగ్రీ కాలేజీల అసోసియేషన్ నాయకుడు మారం నాగేందర్‌రెడ్డి, హనుమంతు యాదవ్, మల్లారెడ్డి, రాజేందర్‌రెడ్డి, రాపోలు శ్రీజ, విద్యార్థులు పాల్గొన్నారు.
ఫ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు
వెంటనే విడుదల చేయాలి
ఫ రౌండ్ టేబుల్ సమావేశంలో
వక్తల డిమాండ్


