యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జిల్లా సరికొత్త రికార్డు | - | Sakshi
Sakshi News home page

యాసంగి ధాన్యం కొనుగోళ్లలో జిల్లా సరికొత్త రికార్డు

Jun 19 2026 2:12 AM | Updated on Jun 19 2026 2:12 AM

మరో 25వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కేంద్రాల్లో ఉంది

మొత్తం కొనుగోలు కేంద్రాలు 358

కొనుగోళ్లు పూర్తయిన కేంద్రాలు 200

ఇంకా మిగిలి ఉన్న కేంద్రాలు 158

కొనుగోలు చేసిన ధాన్యం

4.71 లక్షల మెట్రిక్‌ టన్నులు

చెల్లించిన ధాన్యం డబ్బులు రూ. 870 కోట్లు

కొనుగోలు కేంద్రాల్లో ఉన్న ధాన్యం

25 వేల మెట్రిక్‌ టన్నులు

సాక్షి, యాదాద్రి: యాసంగి ధాన్యం సేకరణలో యాదాద్రి జిల్లా సరికొత్త రికార్డు సృష్టించింది. అంచనా 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు కాగా, ఇప్పటికే 4.71 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని అధికారులు కొనుగోలు చేశారు. రవాణా, నిల్వ సమస్యలను అధిగమించి సుమారు 45వేల మంది రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసి, వారి ఖాతాల్లో ఏకంగా రూ. 870 కోట్లు జమ చేశారు.

ముగింపు దశకు..

ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. రెండు మూడు రోజుల్లో సేకరణ ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు వెల్లడించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన 358 కొనుగోలు కేంద్రాల్లో ఇప్పటికే 200కు పైగా కేంద్రాలను మూసివేశారు. మిగిలిన 158 కేంద్రాల్లో కూడా కొనుగోళ్లు చాలా వరకు ముగింపు దశకు వచ్చాయి. వాటిలో కేవలం 2 నుంచి 3 లారీల ధాన్యం మాత్రమే మిగిలి ఉన్న కేంద్రాలు దాదాపు 100 వరకు ఉన్నాయి. 5 నుంచి 10 లారీల ధాన్యం మిగిలి ఉన్న కేంద్రాలు 30 నుంచి 40 వరకు ఉన్నాయి.

2022 రికార్డు బ్రేక్‌ చేసి..

నూతన జిల్లాగా ఏర్పడిన తర్వాత ఈ యాసంగి సీజన్‌లోనే రికార్డు స్థాయిలో ధాన్యం సేకరించారు. అంచనాలకు మించి దిగుబడులు రావడంతో ఇప్పటివరకు 4.71 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. 2022 యాసంగిలో గరిష్టంగా 4.15 లక్షల నుంచి 4.18 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం సేకరించగా ఈసారి ఆ రికార్డులు బ్రేక్‌అయ్యాయి. ఈయాసంగిలో 4.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. ఈ సారి దిగుబడులు పెరగడంతోపాటు, ప్రైవేట్‌ కొనుగోళ్లు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు మిల్లులకు సీఎంఆర్‌కు కేంద్రం ఆలస్యంగా అనుమతి ఇవ్వడం కూడా కలిసి వచ్చింది. రెండు మూడు రోజుల్లో మరో 20 నుంచి 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో మొత్తం సేకరణ 4.95 లక్షల నుంచి 5 లక్షల మెట్రిక్‌ టన్నులకు చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

రైతులకు రూ. 870 కోట్ల చెల్లింపు

జిల్లాలో ఇప్పటి వరకు 45,215 మంది రైతుల వద్ద నుంచి ధాన్యం సేకరించారు. వీరికి సుమారు రూ.870 కోట్లు చెల్లించారు. మిగిలిన రైతులకు కూడా త్వరలోనే నగదు జమ కానుంది.

ఫ లక్ష్యం 4.50 లక్షల మెట్రిక్‌ టన్నులు.. కొనుగోలు చేసింది 4.71 లక్షల మెట్రిక్‌ టన్నులు

ఫ ముగింపు దశకు ధాన్యం కొనుగోళ్లు

ఫ రైతుల ఖాతాల్లో రూ.870 కోట్లు జమ

పోచంపల్లి, వలిగొండ, చౌటుప్పల్‌, బీబీనగర్‌, నారాయణపురం మండలాల్లో మరో 25 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఉంది. ఈ కొనుగోలు చేసే ధాన్యం నిల్వ చేయడానికి గోదాములను సిద్ధం చేశాం.

– కె. వెంకారెడ్డి,రెవెన్యూ అదనపు కలెక్టర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement