కూతుళ్లంటే ప్రాణం.. మనవడంటే పంచప్రాణాలు | - | Sakshi
Sakshi News home page

కూతుళ్లంటే ప్రాణం.. మనవడంటే పంచప్రాణాలు

May 18 2026 9:55 AM | Updated on May 18 2026 9:55 AM

మిర్యాలగూడ అర్బన్‌ : వేసవి సెలవుల్లో ఆటలాడుతూ ఆనందంగా గడిపేందుకు అమ్మమ్మ ఇంటిన వచ్చిన చిన్నారులకు.. బోరు గుంత రూపంలో వారి తాతను మింగేయడం కుటుంబంలో విషాదంగా నింపింది. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ మండలం యాద్గార్‌పల్లిలో శనివారం బోరుగుంతలో పడిన మనవడిని కాపాడబోయి తాత కుంటు వెంకన్న (53) మృతిచెందడం హృదయ విదారకంగా మారింది. యాద్గార్‌పల్లి ఉప సర్పంచ్‌ కంటు నాగమ్మ–వెంకన్న(53)కి శ్రావణి, మౌనిక, జ్యోతి ముగ్గురు కూతుళ్లు. కూతుళ్లు అంటే వెంకన్నకు పంచప్రాణాలు. పదో తరగతి వరకు చదివిన వెంకన్న తన ముగ్గురు కూతుళ్లను బాగానే చదివించాడు. వీరిలో పెద్ద కుమార్తె శ్రావణి బీటెక్‌ పూర్తి చేయగా ఆమెను నిడమనూరు మండలం నారమ్మగూడం గ్రామానికి చెందిన నాగబోయిన శ్రీనివాస్‌కు ఇచ్చి వివాహం చేశాడు. వారికి లోహిత, హిమాన్ష్‌ సంతానం. వేసవికాలం కావడంతో ఇద్దరు చిన్నారులను తన ఇంటికి తీసుకెళ్లిన వెంకన్న ద్విచక్ర వాహనంపై తిప్పుతూ ఊరంతా చూపించేవాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం 8.30 గంటలకు పొలం వద్దకు మనవడు, మనవరాలిని తీసుకెళ్లిన వెంకన్న.. బోరు వద్ద విద్యుత్‌ మోటార్‌ వైర్‌ను తొలగించి స్టార్టర్‌ బాక్స్‌ను విడదీసి ఇంటికి తీసుకెళ్లేందుకు పూనుకున్నాడు. అక్కడే ఆడుకుంటున్న హిమాన్ష్‌ ఒక్కసారిగా బోరుగుంతలో పడిపోయాడు. గమనించిన తాత వెంకన్న బోరుగుంత వద్దకు వెళ్లి తన మనవడిని తీసేందుకు కిందకు వంగాడు. గుంతపక్కన మట్టి పెల్లలు కుంగి ఒక్కసారిగా బోరుగుంతలో తలకిందులుగా పడిపోయాడు.

కిలోమీటర్‌ పరుగెత్తుకుటూ వెళ్లిన లోహిత..

ఈ ఘటనలను అక్కడే ఉండి చూసిన మనవరాలు లోహిత ఆలస్యం చేయకుండా పొలం గట్ల పైనుంచి సుమారు కిలోమీటరు మేర ఉన్న రోడ్డు వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్లింది. అదే రోడ్డుగుండా వెళ్తున్న ఓ వాహనాదారుడిని ఆపి ఏడ్చుకుంటూ విషయం చెప్పడంతో అతడు బోరుగుంత వద్దకు వెళ్లి చూడగా.. అందులో నుంచి అరుపులు, కేకలు వినిపిస్తున్నాయి. లోహిత తాత సెల్‌ఫోన్‌ను లాక్‌ తీసి ఇవ్వగా డయల్‌ కాల్‌లో ఉన్న ఒక నంబర్‌కు ఫోన్‌చేసి విషయం చెప్పారు. నిమిషాల్లోనే ఈ వార్త గ్రామంలో తెలియడంతో గ్రామస్తులు పరుగెత్తుకుంటూ తాళ్లు, ఇతర సామగ్రితో పొలం వద్దకు వెళ్లారు.

బోరు గుంతలో పడిన మనవడిని కాపాడబోయి తాత మృతి

కిలోమీటర్‌ దూరం పరుగెత్తుకుంటూ వెళ్లిన మనుమరాలు

కాళ్లకు తాడు కట్టుకుని బోరు గుంతలోకి దిగి సాహసించిన యువకుడు

కాళ్లు పట్టుకుని పైకి లాగాను

మాది యాద్గార్‌పల్లి గ్రామం చేపలు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నాను. గ్రామస్తులంతా పరిగెత్తుకుంటూ వెళుతుండగా గమనించి ఏమైంది అని అడిగాను. కంటు వెంకన్న, ఆయన మనువడు బోరుగుంతలో పడ్డారని తెలియడంతో అందరితో పాటు నేను అక్కడికి వెళ్లాను. బోరుగుంతలో పడిన వారిని ఎలాగైనా కాపాడాలని నిశ్చయించుకుని అక్కడికి వచ్చిన పోలీస్‌ వారితో మాట్లాడి కాళ్లకు తాడును కట్టుకుని బోరుగుంతలోకి తలకిందులుగా దిగాను. ఏడు ఫీట్ల లోతులో ఉన్న వెంకన్నను కాళ్లు పట్టుకుని పైకి లాగాను అప్పటికే వెంకన్న మృతిచెందగా బోరు గుంతలో బాబు ఏడుపు వినిపించింది. తిరిగి రెండవ సారి బోరుగుంతలోకి తలకిందులుగా దిగాను. 10 ఫీట్ల లోతులో తల కిందిభాగం వరకు నీటిలో మునిగి ఉన్న బాలుడిని చేతులు పట్టుకుని గట్టిగా అరిచాను. బయట ఉన్నవారు వెంటనే తాడును పైకి లాగారు. దేవుడి దయవల్ల బాబు బతికాడు. తన మనువడిని కాపాడాలనే తొందరలో వెంకన్న బోరు గుంతలో పడి మృతిచెందడం బాధ కలిగించింది. వెంకన్న ముగ్గురు కూతుళ్లను ఎంతో ప్రేమతో చూసుకునేవాడు. మనువడిని మరింతగా ప్రేమగా చూసుకునేవాడు.

– చింతకాయల సైదులు, యాద్గార్‌పల్లి

Advertisement
 
Advertisement
Advertisement