కనగల్ : దర్వేశిపురం స్టేజీ పర్వతగిరి వాయిలేరు వంపు బ్రహ్మంగారి ఆలయ సమీపంలోని ప్రకాశం జిల్లా ఉప్పలపాడుకు చెందిన తాపీమేస్త్రి చావల బెంజిమెన్ (38) ఆదివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాలు.. బెంజిమెన్ కొంతకాలంగా నల్లగొండ చుట్టుపక్కల గ్రామాల్లో తాపీమేస్త్రిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్నాడు. శనివారం కనగల్ మండలం దర్వేశిపురం స్టేజీ వద్దకు వచ్చిన బెంజిమెన్.. పుష్కర ఘాట్ బ్రహ్మంగారి ఆలయ సమీపంలో గల వ్యవసాయ భూమిలో మద్యం తాగి అక్కడే నిద్రించాడు. కాగా తెల్ల వారేసరికి మృతి చెందాడు. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కనగల్ ఎస్ రాజీవ్‌రెడ్డి సెలవులో ఉండడంతో చండూరు ఎస్‌ఐ శివప్రసాద్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. మృతుడి వద్ద లభించిన రెండు సెల్‌ఫోన్లలోని నంబర్ల ఆధారంగా భార్య, పిల్లలకు సమాచారం చేరవేశారు. పోస్టుమార్టం నిమిత్తం నల్లగొండ ప్రభుత్ర ఆస్పత్రికి బెంజిమెన్ మృతదేహాన్ని తరలించారు.
వడదెబ్బతో వ్యక్తి..
భూదాన్‌పోచంపల్లి : వడదెబ్బతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన ఆదివారం భూదాన్‌పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని సీతావానిగూడెం పరిధిలో జరిగింది. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీతావానిగూడెం గ్రామానికి చెందిన ఒంటెద్దు సహదేవ్ (57) రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం 10 గంటల సమయంలో గ్రామ సమీపంలో గల వ్యవసాయ బావుల వద్ద మేకలు మేపేందుకు ఇంటి నుంచి వెళ్లాడు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు వడదెబ్బకు గురై పొలం గట్టు పక్కనే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. సాయంత్రం పశువులను మేపేందుకు అటుగా వెళ్లిన రైతులు సహదేవ్‌ను గమనించారు. లేపేందుకు ప్రయత్నించగా ఉలుకుపలుకు లేదు. దాంతో వారు వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.
గుర్తు తెలియని వ్యక్తి ..
నార్కట్‌పల్లి : గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం నార్కట్‌పల్లి పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్కట్‌పల్లి పట్టణంలోని హైస్కూల్ వెనుక భాగంలో నీటి ట్యాంకు వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉండడంతో గ్రామపంచాయతీ సిబ్బంది గమణించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మతిస్థిమితం లేని వ్యక్తిగా గుర్తించారు. మృతుడి గురించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.
వరుస చోరీలకు
పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
● వివరాలు వెల్లడించిన దేవరకొండ డీఎస్పీ శ్రీనివాస్‌రావు
కొండమల్లేపల్లి : వరుస దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని కొండమల్లేపల్లి పోలీసులు అరెస్ట్ చేసి సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను దేవరకొండ డీఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం తన కార్యాలయంలో వెల్లడించారు. ఏప్రిల్ 9వ తేదీన కొండమల్లేపల్లికి చెందిన ఉపాధ్యాయుడు కర్రె ఆనంద్ ఇంటికి తాళం వేసి చైన్నెకి వెళ్లారు. ఏప్రిల్ 13న ఇంటికి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం పెండ్లిపాకల వద్ద కొండమల్లేపల్లి ఎస్‌ఐ తన సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు చేస్తుండగా.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా రాంరెడ్డిపేట గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ దాసరి విజయ్ అలియాస్ మాస్ విజయ్ అలియాస్ నాని అలియాస్ చరణ్‌ను అనుమానించి ప్రశ్నించగా పారిపోయే ప్రయత్నం చేశాడు. దీంతో సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా చోరీకి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. అలాగే కొండమల్లేపల్లి, దేవరకొండ, చింతపల్లిలలో ఒకటి చొప్పున దొంగతనాలకు పాల్పడగా.. కల్వకుర్తిలో రెండు చోరీలకు పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. పట్టుబడిన వ్యక్తి నుంచి 8 తులాల బంగారు ఆభరణాలు, రూ.90 వేల నగదు, ద్విచక్ర వాహనం, సెల్ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కొండమల్లేపల్లి సీఐ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో కేసును చేధించిన ఎస్‌ఐ అజ్మీర రమేష్, క్రైం సిబ్బంది హేమునాయక్, భాస్కర్, కృష్ణారెడ్డిలను ఎస్పీ, దేవరకొండ డీఎస్పీ అభినందించారు.


