సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే కుంభం | - | Sakshi
Sakshi News home page

సీఎస్‌ను కలిసిన ఎమ్మెల్యే కుంభం

May 17 2026 7:26 AM | Updated on May 17 2026 7:26 AM

భువనగిరి : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) రామకృష్ణారావును శనివారం హైదరాబాద్‌లోని సచివాలయంలో భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా బస్వాపూర్‌ ప్రాజెక్టు పరిధిలో భూములు కోల్పోయిన భూ నిర్వాసతులకు ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ కింద నిధులు విడుదల చేయాలని వినతి పత్రం అందజేశారు.

‘సర్‌’ సర్వేను సమర్థంగా నిర్వహిస్తాం

భవనగిరిటౌన్‌ : ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు జూన్‌ 24 నుంచి జూలై 25 వరకు ప్రత్యేక సమగ్ర ఓటరు సవరణ (సర్‌) ఇంటింటి సర్వేను సమర్థంగా నిర్వహిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ వెంకారెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి శనివారం హైదరాబాద్‌ నుంచి ఉన్నతాధికారులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఎస్‌ఐఆర్‌ మ్యాపింగ్‌ పురోగతి ప్రక్రియ గురించి సమీక్షించారు. అనంతరం అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌కు భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి తదితరులు హాజరయ్యారు.

రైస్‌ మిల్లుల్లో తనిఖీలు

భూదాన్‌పోచంపల్లి : మండలంలోని పిలాయిపల్లి గ్రామంలోని ఇంద్రకీలాద్రి ఆగ్రో రైస్‌ ఇండస్ట్రీస్‌, బాలాజీ రైస్‌మిల్లులో శనివారం ఇంటలిజెన్స్‌ ఎస్పీ రవికుమార్‌ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఆయా రైస్‌ మిల్లుల్లో ఉన్న ధాన్యం స్టాక్‌, రిజిస్టర్లను పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. దోమకాటు వల్ల గట్టితాలు ఉన్నందున 42 కిలోలు కాంటా చేస్తున్నారని రైతులు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ధాన్యం కొనుగోళ్లు, ధాన్యం దిగుమతులకు మిల్లర్లు ఇబ్బందులు పెడుతున్నారని పలు ఫిర్యాదు వస్తుండడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో వాస్తవ పరిస్థితిని తెలుసుకొనేందుకు వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. వీరివెంట సివిల్‌సప్లయ్‌ డీటీ బాలమణి, నర్సింహారెడ్డి తదితరులు ఉన్నారు.

మానవ అక్రమ రవాణా చట్టరీత్యా నేరం

భువనగిరిటౌన్‌ : మానవ అక్రమ రవాణా చట్టరీత్యా అత్యంత తీవ్రమైన నేరమని, దీనిని అరికట్టేందుకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జిల్లా లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్స్‌ ఎస్‌.సాయిశ్రీనివాస్‌, నారగోని రాజశేఖర్‌ అన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎ.జయరాజు సూచన మేరకు భువనగిరి పట్టణంలోని తాతనగర్‌లో గల స్కీడ్‌ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, స్కీడ్‌ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హెచ్‌ఆర్‌జీ కమ్యూనిటీ సభ్యులకు మానవ అక్రమ రవాణాతోపాటు సంబంధిత చట్టాలపై పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ జిల్లా ప్రోగ్రామ్‌ అధికారి డాక్టర్‌ వంశీకృష్ణ, ప్రాజెక్ట్‌ మేనేజర్‌ భానుకుమార్‌, కోఆర్డినేటర్‌ మిథున్‌, ఆర్గనైజర్‌ వెంకటేష్‌, కమ్యూనిటీ సభ్యులు పాల్గొన్నారు.

ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై అవగాహన

రామగిరి (నల్లగొండ) : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నల్లగొండ ఎన్జీ కళాశాలలో కృత్రిమ మేధపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి లీగల్‌ ప్రాక్టీషనర్‌ సిద్దేశ్వర్‌రావు, కంప్యూటర్‌ సైన్స్‌ అధ్యాపకుడు వెంకటరమణ, టీఎస్‌కేసీ మెంటర్‌ ఎండీ.తౌసిఫ్‌, ఇంగ్లిష్‌ విభాగం అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ రిసోర్స్‌ పర్సన్లుగా వ్యవహారించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆర్టిఫిషి యల్‌ ఇంటెలిజెన్స్‌ – మెషిన్‌ లెర్నింగ్‌ నిత్యజీవితంలో వీటి ప్రాధాన్యత, పనితీరును వివరించారు. హెల్త్‌కేర్‌లో వ్యాధుల గుర్తింపునకు, వ్యవసాయంలో దిగుబడిని పెంచేందుకు ఏఐ సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చో వివరించే నమూనాలను ప్రదర్శించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ సముద్రాల ఉపేందర్‌, వైస్‌ ప్రిన్సిపాల్‌ ప్రొఫెసర్‌ అంతటి శ్రీనివాసులు, పరీక్షల నియంత్రణాధికారి డి.మునిస్వామి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement