పశ్చిమ బెంగాల్‌ వలస కూలీల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

పశ్చిమ బెంగాల్‌ వలస కూలీల అరెస్టు

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

భువనగిటౌన్‌ : కూలి పనుల కోసం వచ్చి అడ్డదారిలో డబ్బు సంపాదించాలనే దురాశతో నిషేధిత డ్రగ్స్‌ విక్రయిస్తున్న ఇద్దరు అంతరాష్ట్ర నిందితులను భువనగిరి పట్టణ పోలీసులు శుక్రవారం అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. వీరి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన 50 గ్రాముల బ్రౌన్‌ షుగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇన్‌స్పెక్టర్‌ ఎం.రమేష్‌ కేసు వివరాలను వెల్లడించారు. శుక్రవారం మధ్యాహ్నం భువనగిరి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల గ్రౌండ్‌ సమీపంలో డ్రగ్స్‌ విక్రయిస్తున్నట్లు అందిన విశ్వసనీయ సమాచారంతో టౌన్‌ ఎస్‌ఐ లక్ష్మీనరసయ్య తన సిబ్బందితో కలిసి మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన పశ్చిమ బెంగాల్‌కు చెందిన హబీబుర్రహ్మాన్‌ (48), ఎస్‌.కె.ఖాదిర్‌ (30)ను అదుపులోకి తీసుకుని విచరించారు. స్థానికంగా కూలీ పనులు చేసుకునే వీరు ఇటీవల పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల్లో ఓటేసెందుకు స్వగ్రామాలకు వెళ్లారు. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని మాల్దా జిల్లా నుంచి ఈ బ్రౌన్‌ షుగర్‌ను సేకరించారు. భువనగిరిలో అవసరమున్న వారికి విక్రయించి సొమ్ము చేసుకోవాలనే పథకంతో దీనిని ఇక్కడకు తీసుకొచ్చారు. వీరి వద్ద నుంచి ఒక్కొక్కటి 25 గ్రాముల బరువున్న రెండు బ్రౌన్‌ షుగర్‌ ప్యాకెట్లతో పాటు ఒక మొబైల్‌ ఫోన్‌, నగదును పోలీసులు సీజ్‌ చేశారు. అంతర్జాతీయ మార్కెట్‌లో గ్రాము ధర సుమారు రూ.10 వేల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్‌ మాట్లాడుతూ పట్టణంలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే తెలపాలని కోరారు.

భువనగిరిలో బ్రౌన్‌ షుగర్‌

విక్రయిస్తుండగా పట్టుకున్న పోలీసులు

Advertisement
 
Advertisement
Advertisement