ఫ తెలంగాణ ఇక్కత్
బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లికి చెందిన కళాకారులు రూపొందించిన ఇక్కత్ చేనేత కళను ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం లభించినందుకు ఎంతో గర్వంగా ఉందని మిస్ ఏషియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు జరుగుతున్న 79వ కేన్స్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ సందర్బంగా నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో పాల్గొనేందుకు శుక్రవారం ఆమె ఫ్యారీస్‌కు బయలుదేరి వెళ్తూ ప్రతిక ప్రకటన విడుదల చేశారు. 200 సంవత్సరాల తెలంగాణ వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకెళ్తున్నానని పేర్కొన్నారు. తెలంగాణ చరిత్రలో మొట్టమొదటిసారిగా పోచంపల్లి ఇక్కత్ వస్త్రాలతో రెడ్ కార్పెట్‌పై నడవబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉందని, మగ్గంపై ఎంతో శ్రమకోర్చి కళాత్మక ఇక్కత్ వస్త్రాలను రూపొందించిన పోచంపల్లి నేతన్నలకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తనను తెలంగాణ ఇక్కత్ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించి, మన దేశం నుంచి ఇంటర్నేషనల్ ఫ్యాషన్‌షోలో పాల్గొనే అవకాశం కల్పించిన కేంద్ర ప్రభుత్వ జౌళి మంత్రిత్వ శాఖ చేనేత అభివృద్ధి కమిషనర్, వీవర్స్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపనీ లిమిటెడ్, పోచంపల్లి టై అండ్ డై సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.


