యాదగిరిగుట్ట టెంపుల్
అథారిటీ ఏర్పాటు
సాక్షి, యాదాద్రి : నల్లగొండ–యాదగిరిగుట్ట టెంపుల్ కారిడార్ నిర్మాణంతో ఆధ్యాత్మిక, పర్యాటక రంగానికి సరికొత్త హంగులు అద్దేందుకు ప్రభుత్వం భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో మెగాగ్రోత్ కారిడార్ల అభివృద్ధిపై సీఎం ఎ.రేవంత్‌రెడ్డి బుధవారం నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. నల్లగొండ జిల్లా కేంద్రం నుంచి యాదాద్రి భువనగిరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టను కలుపుతూ ప్రత్యేక టెంపుల్ కారిడార్‌ను ప్రకటించారు. దీంతో ఆధ్యాత్మిక జిల్లాలుగా పేరున్న నల్లగొండ, యాదాద్రిభువనగిరిలో మరింత అభివృద్ధి జరగనుంది.
అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్
పెరుగుతున్న భక్తుల రద్దీ, 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రాజెక్టును అంతర్జాతీయ ప్రమాణాలతో డిజైన్ చేయనున్నారు. ఇప్పటికే యాదగిరిగుట్ట, నాగార్జునసాగర్, భువనగిరి ఖిలా, చెర్వుగట్టు, నల్లగొండలోని ఛాయసోమేశ్వర క్షేత్రాలు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి.
నాలుగు లేన్లగా రహదారులు..
నల్లగొండ–యాదగిరిగుట్టతోపాటు రెండు జిల్లాల్లో ఉన్న పర్యాటక, ఆధ్యాత్మిక, పుణ్య క్షేత్రాల మధ్యన ప్రయాణ సమయాన్ని తగ్గించడంతో పాటు, సురక్షితమైన ప్రయాణాన్ని అందించేలా అత్యాధునిక లింక్ రోడ్లు, రేడియల్ రోడ్లను నిర్మించనున్నారు. ఈ కారిడార్ కేవలం రహదారి విస్తరణణే కాకుండా, మార్గమధ్యంలో పర్యాటకులకు అవసరమైన అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు, బస్ సౌకర్యం, ఈవీ వాహనాలను అందుబాటులోకి తేనున్నారు. గ్రీన్ జోన్ల అభివృద్ధితో కూడిన సమగ్ర ప్యాకేజీగా ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకోనుంది.
మారనున్న ముఖచిత్రం..
టెంపుల్ కారిడార్‌తో నల్లగొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల పరిధిలో గల ప్రధాన పట్టణాలు, క్షేత్ర గ్రామాలు, మున్సిపాలిటీలు, సమీప మండలాల ముఖచిత్రం రూపురేఖలు మారనున్నాయి.
మెగాగ్రోత్ కారిడార్‌లో భాగంగా టూరిజం, ఆధ్యాత్మిక కేంద్రాలను అభివృద్ధి చేయనున్నారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనర్సింహస్వామి ఆలయ పాలన వ్యవహారాల కోసం టీటీడీ తరహాలో టెంపుల్ బోర్డు ఏర్పాటుకు చట్టం చేశారు. త్వరలో నూతన పాలక మండలి నియామకం చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే యాదగిరిగుట్టలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడంతోపాటు కొత్త ప్రాజెక్టులను చేపట్టనున్నారు. సోలార్ ఎనర్జీ ప్లాంట్, పర్యాటక సదుపాయలకు మెరుగుపర్చనున్నారు. ఇప్పటికే ఎంఎంటీఎస్‌ను యాదాద్రి వరకు పొడిగించే పనులు వేగంగా జరుగుతున్నాయి. టెంపుల్ టూరిజం ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపడుతాయని ప్రభుత్వం భావిస్తోంది. డీపీఆర్‌ను సిద్ధం చేయాలని అధికారులను ఇటీవల సీఎం ఆదేశించారు.
నల్లగొండ– యాదగిరిగుట్ట మధ్య నిర్మాణానికి ప్రణాళిక
ఫ మెగాగ్రోత్ ప్లాన్‌లో ఆధ్యాత్మిక
నగరాల అనుసంధానం
ఫ 25 ఏళ్ల భవిష్యత్ అవసరాలే
లక్ష్యంగా రోడ్ల అభివృద్ధి
ఫ డీపీఆర్‌లు సిద్ధం చేయాలని
సీఎం ఆదేశాలు


