భువనగిరి(బీబీనగర్) : రోగుల ఆరోగ్య సంరక్షణలో నర్సుల పాత్ర కీలకమని తెలంగాణ నర్సెస్ అండ్ మిడ్ వైవ్స్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రొఫెసర్ విద్యులత అన్నారు. శుక్రవారం బీబీనగర్ ఎయిమ్స్‌లో నిర్వహించిన అంతర్జాతీయ నర్సుల దినోత్సవం ముగింపు వారోత్సవాలకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నర్సులు దేవుళ్లకు ప్రతిరూపాలన్నారు. అంతకు ముందు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో బీబీనగర్ నర్సింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ లత, బీబీనగర్ ఎయిమ్స్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అమితా అగర్వాల్, డాక్టర్ రాహుల్‌నారంగ్, డీన్, నితన్ అశోక్, జీబి కుల్దీప్ పాల్గొన్నారు.
గ్యాస్ సిలిండర్ల కోసం రోడ్డెక్కిన జనం
సంస్థాన్ నారాయణపురం : వారం రోజులుగా గ్యాస్ రీఫిల్ సిలిండర్ల కొరత ఉండడంతో శుక్రవారం సంస్థాన్ నారాయణపురంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ వద్ద ప్రధాన రహదారిపై వినియోగదారులు రాస్తారోకో చేశారు. బుకింగ్ చేసుకున్న సమయం దాటుతున్నా స్టాక్ రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్యాస్ రీఫిలింగ్ బుకింగ్ అవుతున్నప్పటికీ గ్రామాలకు గ్యాస్ వాహనాలు రావడం లేదని ఆరోపించారు. వేసవి కాలంలో గ్యాస్ సిలిండర్ల కోసం ప్రతిరోజూ ఏజెన్సీ చుట్టు తిరగాలంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులు జోక్యం చేసుకుని వినియోగదారులకు క్రమ పద్ధతిలో బుకింగ్ ప్రకారం సిలిండర్‌లు ఇవ్వాలని ఏజెన్సీవారికి సూచించారు. కాగా శుక్రవారం గ్యాస్ కోసం వచ్చిన గట్టుప్పల్‌కు చెందిన మహిళ సృహ తప్పి పడిపోవడంతో పోలీసులు చౌటుప్పల్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించారు.
రైతులు సేంద్రియ
ఎరువులను వాడాలి
యాదగిరిగుట్ట రూరల్ : రైతులు సేంద్రియ ఎరువులను వాడాలని జయశంకర్ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ మధు అన్నారు. శుక్రవారం యాదగిరిగుట్ట మండలంలోని సైదాపురం గ్రామంలోని రైతు వేదికలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం నిర్వహించారు. వరిలో నారుమడి, యాజమాన్యం, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సకాలంలో విత్తుకోవడంపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు రసాయన మందుల వాడకాన్ని తగ్గించాలన్నారు. కార్యక్రమంలో ప్రొఫెసర్ రాకేష్, ఏఈఓ విరణ్, సర్పంచ్ కన్నాయి రోజా, ఉప సర్పంచ్ దుంబాల వెంకట్‌రెడ్డితదితరులు పాల్గొన్నారు.


