కొనుగోళ్లు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

కొనుగోళ్లు వేగవంతం చేయండి

May 16 2026 6:27 AM | Updated on May 16 2026 6:27 AM

కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

భూదాన్‌పోచంపల్లి : ధాన్యం కొనుగోళ్లను మరింత వేగవంతం చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అన్నారు. శుక్రవారం భూదాన్‌పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సివిల్‌సప్లయ్‌ డీఎం హరికృష్ణతో కలిసి కలెక్టర్‌ సందర్శించారు. నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం నిల్వ, కాంటాల వివరాలు తెలుసుకున్నారు. కొనుగోళ్లలో ఎదురవుతున్న ఇబ్బందులను రైతులను అడిగి తెలుసుకున్నారు. కాంటాల్లో వేగం పెంచాలని, హమాలీల కొరత లేకుండా చూడాలని, మిల్లుల వద్ద త్వరగా ధాన్యం దిగుమతి అయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం ముక్తాపూర్‌లోని ఓ రైస్‌మిల్లును సందర్శించారు. అక్కడ ఉన్న ధాన్యం స్టాక్‌ను పరిశీలించారు. హమాలీల సంఖ్య పెంచి వెంటవెంటనే ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని మిల్లర్లను ఆదేశించారు.

నెలాఖరు వరకు కొనుగోళ్లు పూర్తి

అనంతరం సివిల్‌ సప్లయ్‌ డీఎం హరికృష్ణ మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోళ్లను ఈనెలాఖరు లేదా జూన్‌ మొదటి వారంలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. పోచంపల్లి మండలంలో ఈసారి పంట ఆలస్యంగా వచ్చిందని, దాంతో కాంటాలు వేయడం ఆలస్యమైందన్నారు. జిల్లాలో పోచంపల్లి, వలిగొండ, రామన్నపేట మండలాల నుంచే అధికంగా ధాన్యం వస్తుందని తెలిపారు. పోచంపల్లి మండలంలో ఇప్పటివరకు 14 వేల టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామన్నారు. మిల్లుల్లో ధాన్యం నిల్వ చేయడానికి స్థలం కొరత ఉన్నందున రాజాపేట, తుర్కపల్లి, వలిగొండ, రామన్నపేట, చౌటుప్పల్‌లో 25 లక్షల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలలో నిల్వ చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్‌ తహసీల్దార్‌ నాగేశ్వర్‌రావు, ఇన్‌చార్జ్‌ ఎంపీడీఓ ఏపాల సత్యనారాయణరెడ్డి, మండల వ్యవసాయ అఽధికారి శైలజ, ఎంఆర్‌ఐ గుత్తా వెంకట్‌రెడ్డి, సర్పంచ్‌ కాసుల అంజయ్యగౌడ్‌, పీఏసీఎస్‌ సీఈఓ రెబ్బాస్‌ నర్సింహ, అర్థం అశోక్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement