భువనగిరిటౌన్ : మిల్లర్ల అక్రమ కోతలను అరికట్టి రవాణా భారం రైతులపై పడకుండా చూడాలని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ నాయకులతో కలిసి కలెక్టర్ అనురాగ్ జయంతికి కలెక్టరేట్‌లో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ.. జిల్లావ్యాప్తంగా 357 కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు కనీసం 10 శాతం ధాన్యం కూడా కొనుగోలు చేయలేదన్నారు. కేంద్రాల్లో కాంటాలు సకాలంలో వేయడం లేదని, వర్షం వస్తే ధాన్యం తడవకుండా రైతులకు టార్పాలిన్లు కూడా ఇవ్వడం లేదన్నారు. నిబంధనల ప్రకారం బస్తాకు 40 కిలోలు తూకం వేయాల్సి ఉండగా.. 41 నుంచి 42 కిలోల వరకు తూకం వేస్తున్నారన్నారు. దీనికితోడు మిల్లర్లు తరుగు పేరిట క్వింటాలుకు రెండున్నల కిలోల నుంచి 5 కిలోల వరకు కోత విధిస్తున్నారని అన్నారు. లారీలు, డీసీఎంలు సకాలంలో రాకపోవడంతో మోత్కూరు మార్కెట్ వంటి కేంద్రాల్లో రైతులు సొంతంగా లారీలకు రూ.3,000, డీసీఎంలకు రూ.1,500 అదనపు కిరాయిలు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాలను అధికారులు పర్యవేక్షించడం లేదన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు ఏవీ కిరణ్, మండల అధ్యక్షుడు జనగాం పాండు, కౌన్సిలర్ నాగు, చిన్న మహేష్, అతిఎకం లక్ష్మీనారాయణ గౌడ్, సుబ్బూరు బీరు మల్లయ్య, అజీముద్దీన్, సందుల సుధాకర్, జంజద్, గుజ్జ పవన్, రాకెల శ్రీనివాస్, సూరపల్లి రమేష్ తదితరులు పాల్గొన్నారు
ఫ బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
కంచర్ల రామకృష్ణారెడ్డి


