భువనగిరి: విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, నల్లగొండ క్రికెట్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. వేసవిలో సమయాన్ని వృథా చేయకుండా క్రీడల్లో పాల్గొని తన ప్రతిభను ప్రదర్శించాలని సూచించారు. వేసవి శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ టి. శ్రీవాణి, నిర్వాహకులు అమీనుద్దీన్, అబోతుల కేతన్, సతీష్, ఇబ్రహీం పాల్గొన్నారు.
సేవలకు ప్రతిరూపం నర్సులు
భువనగిరి: సేవలకు ప్రతిరూపం నర్సులు అని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ మనోహర్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఆస్పత్రిలో రోగులకు నర్సులు అందించే సేవలు వెలకట్టలేనిదన్నారు. అనంతరం కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నర్సింగ్ అధికారులను శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో డిప్యూటి డీఎంహెచ్‌ఓ డాక్టర్ యశోద, ప్రోగ్రాం ఆఫీసర్లు వీణ, రామకృష్ణ, డిప్యూటీ డెమో పద్మసత్యవతి, సిబ్బంది పాల్గొన్నారు.
యాదగిరీశుడి క్షేత్రంలో గజవాహన సేవ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గజవాహన సేవను వైభవంగా జరిపించారు. మంగళవారం వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకార మూర్తులకు పాంచరాత్ర ఆగమశాస్త్రానుసారంగా పాలతో నిజాభిషేకం జరిపించి, సహస్ర నామార్చన , అష్టోత్తరం వంటి పూజలను చేపట్టారు. ఇక ప్రఽథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణ వేడుక, బ్రహ్మోత్సవాన్ని భక్తుల మధ్య జరిపించారు. సాయంత్రం వేళ జోడు సేవలను ఆలయ తిరు, మాడ వీధుల్లో ఊరేగించారు. శ్రీస్వామి వారికి నివేదన జరిగిన తరువాత పవళింపు సేవను నిర్వహించి, ద్వార బంధనం చేశారు.
శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి కారణజన్ములు
చౌటుప్పల్ : శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కారణజన్ములని శ్రీజగద్గురు శ్రీకాంతేంద్రస్వామీజీ తెలిపారు. చౌటుప్పల్‌లో నూతనంగా నిర్మించిన శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి దేవాలయంలో శ్రీగోవిందమాంబ సమేత జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఉత్సవాలు మంగళవారం రెండవరోజు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా వేడుకల్లో పాల్గొన్న శ్రీజగద్గురు శ్రీకాంతేంద్రస్వామీజీ.. పోతులూరి బాషణం చేశారు. చిన్నపాటి బ్యాక్టీరీయా నుంచి మానవ రూపం వరకు ఎన్నో కోట్ల జన్మలు పొందిన గొప్ప భగవత్ స్వరూపులని తెలిపారు. ఈ వేడుకల్లో మనుమయ సంఘం అధ్యక్షుడు పంతంగి మదనాచారి, స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కందుకూరి కిషోర్‌కుమార్‌చారి, దేవాలయ కమిటీ అధ్యక్షుడు పోలోజు శ్రీనివాసచారి, భక్తులు పాల్గొన్నారు.


