నర్సింగ్‌ కళాశాలకు శాశ్వత భవనం | - | Sakshi
Sakshi News home page

నర్సింగ్‌ కళాశాలకు శాశ్వత భవనం

May 13 2026 4:56 AM | Updated on May 13 2026 4:56 AM

శంకుస్థాపనకు ఏర్పాట్లు పూర్తి

భువనగిరి: ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల శాశ్వత భవన నిర్మాణానికి అడుగు పడింది. భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో కేటాయించిన 5 ఎకరాల స్థలంలో రూ. 26 కోట్లతో నిర్మించనున్న నూతన భవనానికి బుధవారం మంత్రులు భూమిపూజ చేయనున్నారు. ఏడాది కాలంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్న కళాశాలకు శాశ్వత పరిష్కారం చూపేలా ప్రభుత్వం ఈ నిధులు మంజూరు చేసింది.

అద్దెభవనంలో..

ప్రభుత్వం 2024లో జిల్లాకు ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను మంజూరు చేసింది. కళాశాల మంజూరు అయిన ఏడాదిలోనే కళాశాలలో అడ్మిషన్లుసైతం జరిగాయి. దీంతో అప్పటికప్పుడు పట్టణంలో అద్దె భవనంలో కళాశాలను నిర్వహించారు. ఇప్పటివరకు కళాశాలకు రెండు బ్యాచ్‌ల విద్యార్థులు వచ్చారు. బ్యాచ్‌కు 60 మంది చొప్పున అడ్మిషన్లు పొందుతున్నారు. ప్రస్తుతం కళాశాలలో 120మంది విద్యార్థులు ఉండటంతో అద్దె భవనంలో ఇబ్బందులు ఎదురుకావడంతో మరో అద్దె భవనంలోకి మారారు.

జీప్లస్‌ 3 విధానంలో..

ప్రస్తుతం అద్దెభవనంలో విద్యార్థులకు ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు అద్దె చెల్లింపువిషయాన్ని దృష్టిలో పెట్టుకుని కళాశాల ప్రిన్సిపల్‌ పలుమార్లు శాశ్వత భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేయాలని విజ్ఞిప్తిచేశారు. ఉన్నత అధికారుల సహకారంతో చేసిన విజ్ఞప్తికి ప్రభుత్వం జిల్లాకు చెందిన నర్సింగ్‌ కళాశాల నూతన భవన నిర్మాణానికి అనుమతి ఇవ్వడంతోపాటు రూ. 26కోట్లు మంజూరు చేసింది. దీంతో భువనగిరి మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో 5 ఎకరాల స్థలాన్ని పరిశీలించి భవన నిర్మాణానికి అనువుగా ఉంటుందని భావించి అక్కడే కళాశాల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. ఇప్పటికే టెండర్లు పూర్తి కాగా టీజీఎంఎస్‌ఐడీసీ ఆధ్వర్యంలో ఈ భవనాన్ని జీప్లస్‌ 3 విధానంలో నిర్మించనున్నారు. సంవత్సరం వరకు భవన నిర్మాణాన్ని పూర్తిచేయాల్సి ఉంటుంది. సుమారు 240 మంది విద్యార్థులు ఉండేలా భవన నిర్మాణాలు జరగనున్నాయి. ఏ బ్లాక్‌లో బోధన గదులు, బీ బ్లాక్‌లో హాస్టల్‌ వసతి గల భవనాలను నిర్మించనున్నారు.

ఫ ముత్తిరెడ్డిగూడెం గ్రామ పరిధిలో 5 ఎకరాల స్థలం కేటాయింపు

ఫ భవన నిర్మాణానికి రూ. 26 కోట్లు మంజూరు

ఫ నేడు మంత్రుల చేతులమీదుగా శంకు స్థాపన

ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాల నిర్మాణాకి బుధవారం శంకు స్థాపన చేయనున్నారు. ఇందు కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి హాజరు కానున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement