సాక్షి, యాదాద్రి : కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యం దిగుమతిలో జాప్యం చేయవద్దని కలెక్టర్ అనురాగ్ జయంతి సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ..ధాన్యం, మొక్కజొన్న కొనుగోళ్లపై మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, వాకిటి శ్రీహరి, ధనసరి అనసూయ (సీతక్క), అడ్లూరి లక్ష్మణ్ కుమార్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడారు.కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యాన్ని తక్షణమే కాంటా వేయాలన్నారు.తూకం పూర్తయిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలను పూర్తి చేసి మిల్లులకు తరలించాలని ఆదేశించారు. కేంద్రాల వద్ద, మిల్లుల వద్ద హమాలీల కొరత లేకుండా చూడాలన్నారు. ధాన్యం రవాణాలో జాప్యం జరగకుండా కాంట్రాక్టర్లతో మాట్లాడి అదనపు లారీలను ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రతి కొనుగోలు కేంద్రం, మిల్లు వద్ద ఒక ప్రత్యేక అధికారిని నియమిస్తామని వారు రోజూ నివేదికను సమర్పించాలని ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ నాగిరెడ్డి, జిల్లా సివిల్ సప్లయ్ మేనేజర్ హరికృష్ణ, జిల్లా సివిల్ సప్లయ్ అధికారి రోజా రాణి, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి మురళి పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ అనురాగ్ జయంతి


