చౌటుప్పల్ : పాఠశాలలకు వేసవి సెలవులు వచ్చాయంటే చాలు.. విద్యార్థుల ఆనందానికి అవధులు ఉండవనే చెప్పాలి. సెలవుల్లో తమకు తోచిన ఆటలు ఆడుతూ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే నేటి డిజిటల్ యుగంలో పిల్లలు సెల్‌ఫోన్, టీవీలకు అతుక్కుపోయి ఆటలకు దూరం అవుతున్నారు. ఈ ధోరణిని మారుస్తూ చౌటుప్పల్‌లో తల్లిదండ్రులు తమ చిన్నారులకు ఇండోర్, అవుట్‌డోర్ ఆటలు నేర్పిస్తున్నారు. నృత్యం, స్విమ్మింగ్, కంప్యూటర్‌లో శిక్షణ, స్పోకెన్ ఇంగ్లిష్ శిక్షణకు పంపిస్తున్నారు.
నృత్య శిక్షణపై చిన్నారుల ఆసక్తి
వేసవి సెలవుల్లో ఆటపాటలతోపాటు విద్యార్థులు నృత్యం నేర్చుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. విద్యార్థుల ఆసక్తిని గమనించిన చౌటుప్పల్ పట్టణ కేంద్రంలోని వారాహి డ్యాన్స్ స్టూడియో వారు విద్యార్థులకు నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైన నాటి నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో ఒక్కో బ్యాచ్‌కు గంట సమయం చొప్పున తరగతులు నిర్వహిస్తున్నారు. నాలుగేళ్ల నుంచి 20 ఏళ్ల వరకు వయస్సు కలిగిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని నృత్య శిక్షణ పొందుతున్నారు. ఇక్కడ వెస్టర్న్, కూచిపూడి, ఫోక్, దాండియా, గర్భా డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. ఇక్కడికి వచ్చే విద్యార్థులు అన్ని రకాల నృత్యాలపై శిక్షణ పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరుగా కూడా తరగతులు నిర్వహిస్తున్నారు. శిక్షకులు ఎడ్ల హిమబిందురెడ్డి, సామినేని దీపిక విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుని శిక్షణ అందిస్తున్నారు.
శారీరక వ్యాయామంతోపాటు ఏకాగ్రత..
నృత్యం నేర్చుకోవడం ద్వారా అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులకు ప్రధానంగా శారీరక వ్యాయామం అవుతుంది. దీంతో మంచి ఫిట్‌నెస్ లభిస్తుంది. ప్రతిక్షణం మనిషిలో ఉత్సాహం ఉండే విధంగా దోహదం చేస్తుంది. లక్ష్యంపై దృష్టి పెట్టేందుకు ఏకాగ్రతను పెరుగుతుంది. శిక్షణ శిబిరంలో నృత్యం నేర్చుకున్న విద్యార్థులు ఇంటికి వెళ్లిన తర్వాత గంటల తరబడి సాధన చేస్తూ సెలవులను అర్థవంతంగా గడుపుతున్నారు.
ఫ వేసవి సెలవుల్లో నృత్య శిక్షణకు వెళ్తున్న విద్యార్థులు
ఫ ఏకాగ్రతతోపాటు లక్ష్యంపై గురిపెట్టేందుకు దోహదం
ఫ చిన్నారులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న తల్లిదండ్రులు


