ప్రైవేట్‌ కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ కళాశాలల నుంచి దరఖాస్తుల ఆహ్వానం

May 8 2026 9:44 AM | Updated on May 8 2026 9:44 AM

భువనగిరిటౌన్‌ : జిల్లాలో 2026–27 విద్యా సంవత్సరానికి కార్పొరేట్‌ విద్యా పథకం కింద విద్యార్థులకు ప్రవేశాలు కల్పించేందుకు అర్హత గల ప్రైవేటు జూనియర్‌ కళాశాలల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ ఇన్‌చార్జ్‌ అధికారి పి.సాహితి తెలిపారు. హాస్టల్‌ వసతి, ఉత్తమ విద్యా ప్రమాణాలు కలిగి ఉన్న కళాశాలలు ఈ నెల 11వ తేదీలోపు ఈ–పాస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించారు.గత ఐదేళ్ల అకడమిక్‌ ప్రొఫైల్‌తో కొత్త రిజిస్ట్రేషన్లు లేదా రెన్యువల్స్‌ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తుల హార్డ్‌ కాపీలను ధ్రువపత్రాలతో జతచేసి రాయగిరిలోని కలెక్టరేట్‌లో రూమ్‌ నంబర్‌ ఎస్‌ –17లో సమర్పించాలని, గడువు దాటిన తర్వాత దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

యాదగిరీశుడికి సంప్రదాయ పూజలు

యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెల్లవారు జామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన, ఆరాధన, బాల భోగం, సహస్ర నామార్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలు జరిపించారు. సాయంత్రం ఆలయ తిరు, మాడ వీధుల్లో జోడు సేవలను ఊరేగించారు.

కేవీలో అడ్మిషన్లు

రామగిరి (నల్లగొండ): నల్లగొండలోని కేంద్రీయ విద్యాలయం (కేవీ)లో అడ్మిషన్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ప్రిన్సిపాల్‌ జి.శ్రీనివాసులు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సంర ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 20 సీట్లు, 3వ తరగతి 1 సీటు ఖాళీ ఉందని పేర్కొన్నారు. ఆసక్తి గల అర్హులైన వారు ఈ నెల 15వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివి

రామగిరి (నల్లగొండ) : తెలంగాణ కవి డాక్టర్‌ బోయ జంగయ్య సాహిత్య సేవలు మరువలేనివని ప్రముఖ కవి మేరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. తెలంగాణ సాహితీ నల్లగొండ జిల్లా ఆధ్వర్యంలో గురువారం నల్లగొండలోని యూటీఎఫ్‌ భవన్‌లో బోయ జంగయ్య వర్ధంతి సభను నిర్వహించారు. జంగయ్య చిత్రపటానికి కవులు, రచయితలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యాదగిరిరెడ్డి మాట్లాడుతూ బోయ జంగయ్య రచయితగా సమాజంలో ఉన్న మూఢనమ్మకాలను తొలగించడానికి ప్రయత్నం చేసిన సంఘ సంస్కర్త అని కొనియాడారు. కార్యక్రమంలో సినీ విమర్శకుడు డాక్టర్‌ ఎం.పురుషోత్తమాచార్య, పున్న అంజయ్య,రామన్నపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ తండు కృష్ణకౌండిన్య, తెలంగాణ సాహితీ జిల్లా అధ్యక్షుడు కుకుడాల గోవర్ధన్‌, జీవకవి మునాసు వెంకట్‌, డాక్టర్‌ హసేన పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం

అర్వపల్లి: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. అర్వపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గురువారం ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ లారీల కొరతతో ధాన్యం ఎగుమతులు కాక రైతులు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మిల్లర్లు తాలు పేరుతో ధాన్యం తూకాల్లో కోతలు విధిస్తున్నారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement