యాదగిరిగుట్ట: ఆర్టీసీ కార్మికుల సంక్షేమంపై కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను నెరవేరుస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో పాటు చర్చలు సఫలమైన సందర్భంగా శనివారం ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో యాదగిరిగుట్ట ఆర్టీసీ డిపోలో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడం చాలా సంతోషకరమైన అంశమన్నారు. కార్మికులు ప్రభుత్వం ముందు పెట్టిన 31 డిమాండ్లను నెరవేర్చడానికి ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల సవరణ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో ఆర్టీసీ కార్మికులు 50 రోజులు సమ్మె చేసినా పట్టించుకోలేదని, కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం మూడు రోజుల్లోనే ఆర్టీసీ కార్మికుల సమస్యలపై స్పందించి, పరిష్కరిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న కాలంలోనే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. అనంతరం డిపోలో నుంచి బస్సును నడుపుకుంటూ బస్టాండ్‌లోకి తీసుకువచ్చారు. అక్కడ కలిసిన ప్రయాణికులతో సమస్యలను తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ మురళీకృష్ణ, మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు బందారపు భిక్షపతి, కాంగ్రెస్ నాయకులు గుండ్లపల్లి భరత్‌గౌడ్, ఎరుకల హేమేందర్‌గౌడ్ పాల్గొన్నారు.


