తగ్గిన దిగుబడి..
సంస్థాన్ నారాయణపురం : పుచ్చ సాగు చేసిన రైతులు ఈసారి నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. ఓ పక్క తెగుళ్లు సోకి దిగుబడిపై ప్రభావం చూపగా మరో పక్క చేతికొచ్చిన కొద్ది పాటి పంటకు మార్కెట్‌లో ధరలేక కుదేలయ్యారు. పుచ్చకాయ కిలో రూ.5 రేటు పలుకుతోంది. దీంతో దిక్కుతోచని స్థితిలో పశులకు మేతగా వదిలేస్తున్నారు.
150 ఎకరాల్లో సాగు
సంస్థాన్‌నారాయణపురం మండలంలోని రైతులు సుమారు 150 ఎకరాల్లో పుచ్చకాయ పంటను సాగుచేశారు. అలాగే ఒక్క పుట్టపాక గ్రామంలో 70 ఎకరాలకు పైగా పుచ్చసాగైంది. 20 రోజుల క్రితం కురిసిన వర్షానికి పుచ్చ పంటకు తెగుళ్లు సోకాయి. ఆకులకు బూడిద తెగులు వ్యాప్తి చెందింది. దీంతో కాయ సైజు పెరుగుదల నిలిచిపోయింది. రైతుల ఎన్ని మందులు పిచికారీ చేసినా నివారించలేకపోయారు.అలాగే ముందు సాగు చేసిన పుచ్చకాయ సైజు వచ్చినప్పటికీ కాయకు మచ్చ తెగులు వ్యాప్తించింది. దీంతో కాయ పనికిరాకుండా పోయింది. చాలామంది రైతులు పుచ్చ పంటను పశువులకు వదిలి పెట్టారు.
పుచ్చ పంట సాగు చేయడానికి ఎకరాకు ఒక్కో రైతు సుమారు రూ.60వేల నుంచి రూ. 70వేల వరకు పెట్టుబడి పెట్టాడు. వాస్తవానికి ఎకరాకు 25క్వింటాళ్ల నుంచి 30క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉంది. కానీ తెగుళ్ల కారణంగా 10క్వింటాళ్ల నుంచి 15క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. గత సంవత్సరం కిలో రూ.15 నుంచి రూ. 20 పలికిన ధర ప్రస్తుతం రూ.5గా ఉంది. హైదారాబాద్‌కు చెందిన వ్యాపారులు పంటను కొనుగోలు చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రస్తుతం రైతులు పంటను అమ్మకోవడం కష్టంగా మారింది. కొంత మంది రైతులకు మొదట కోత పంట చేతికి వచ్చినప్పటికి, రెండవ కొత పంటకు తెగుళ్లసోకాయి. దీంతో పూర్తిగా పశువులుకు మేతగా మారింది. చాలా మంది రైతులకు ఎకరాకు రూ.20వేల నుంచి 30వేల వరకు నష్టం వాటిల్లింది.
ఫ నిండా ముంచిన బూడిద, మచ్చ తెగుళ్లు
ఫ దిగుబడిపై తీవ్ర ప్రభావం
ఫ మార్కెట్లో ధర అంతంత మాత్రమే
ఫ పెట్టుబడులు వెళ్లక రైతుల్లో దిగులు
ఫ పశువులకు మేతగా పంట
ఈ ఫొటోలో కన్పిస్తున్న రైతు పేరు ఈదుల నరేష్. సొంతూరు సంస్థాన్‌నారాయణపురం మండలం బట్టోనిబావి. ఈ రైతులు మూడో ఎకరాలలో పుచ్చ పంట సాగు చేశాడు. దీనికోసం రూ.1.60లక్షలు పెట్టుబడి పెట్టాడు. మొదటి కోత పంటఅమ్మడం వల్ల రూ.60వేలు వచ్చింది. ఇక రెండవ కోత సమయానికి బూడిద తెగులు, కాయకు మచ్చ తెగులు ఆశించింది. దీంతో కాయ సైజు తగ్గంది. దీంతో వాటిని పశువుల మేతగా వదిపిపెట్టాల్సి వచ్చింది. దీంతో ఆ రైతు రూ.లక్ష వరకు నష్టం వచ్చింది.


