నీటి ఎద్దడి నివారణకు రూ. 88.15లక్షలు | - | Sakshi
Sakshi News home page

నీటి ఎద్దడి నివారణకు రూ. 88.15లక్షలు

Apr 9 2026 8:35 AM | Updated on Apr 9 2026 8:35 AM

సాక్షి, యాదాద్రి : జిల్లాలో వేసవికాలంలో తాగునీటి ఎద్దడి నివారణకు కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి సత్వర చర్యలు చేపట్టారు. సమ్మర్‌ యాక్షన్‌ ప్లాన్‌ 2026లో భాగంగా రూ. 88.15 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రణాళికలో భాగంగా రైతుల నుంచి అద్దె ప్రాతిపదికన బోర్లను తీసుకోవడం, తాత్కాలిక పైప్‌లైన్ల ఏర్పాటు, బోర్ల ఫ్లషింగ్‌, డీపెనింగ్‌ వంటి పనులను చేపట్టనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడా మంచినీటి సమస్య తలెత్తకుండా ఈ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ ఆదేశించారు. పనుల పర్యవేక్షణ బాధ్యతను మిషన్‌ భగీరథ కార్యనిర్వాహక ఇంజనీర్‌ పి. కరుణాకరన్‌ కు అప్పగించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెంటనే పనులు ప్రారంభించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.

క్రీడా శిబిరాల నిర్వహణకు దరఖాస్తుల ఆహ్వానం

భువనగిరి: వేసవి క్రీడా శిక్షణా శిబిరాలు న్విహించేందుకు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి కె. ధనుంజయనేయులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాల్లో మే 1 నుంచి 31 వరకు.. 12 నుంచి 14 ఏళ్ల బాలబాలికలకు వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ శిబిరాల నిర్వహణకు సీనియర్‌ క్రీడాకారులు, జాతీయ స్థాయి క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకోవచ్చని సూచించారు. సీనియర్‌, జాతీయ స్థాయి క్రీడాకారులైతే వారు సాధించిన ప్రగతి ధ్రువీకరణ పత్రాలను అందజేయాలని కోరారు. ఒక్కొక్కరు ఏదైనా ఒక క్రీడకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణ శిబిరం నిర్వహించే వారికి గౌరవ వేతనం ఇవ్వడంతో పాటు శిక్షణ పొందినవారికి గుర్తింపుపత్రాన్ని ఇవ్వనున్నట్లు తెలిపారు. అర్హత ఆసక్తి కలిగిన వారు ఈ నెల 18వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు సెల్‌ నంబర్‌ 8309992451ను సంప్రదించాలని కోరారు.

లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరం

భువనగిరి: లింగ నిర్ధారణ పరీక్షలు చేయడం నేరమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ మనోహర్‌ హెచ్చరించారు. బుధవారం యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా అడ్వైజరీ కమిటీ సమావేశంలో డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. నిబంధనలు ఉల్లఘించకుండా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీసీ అండ్‌ పీఎన్‌డీటీ ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ యశోద, డాక్టర్‌ వై. ఇందిరామణి, గైనకాలజిస్ట్‌ జ్యోతి, శ్రీదేవి, నిర్మల, పిల్లల వైద్య నిపుణులు డాక్టర్‌ సుమన్‌కళ్యాణ్‌, డిప్యూటీ డీపీఆర్‌ఓ అరుంధతి, డాక్టర్‌ ప్రమీల, శివలింగం, నాగరాజు, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది స్వచ్ఛభారత్‌

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో భద్రతా విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌పీఎఫ్‌ సిబ్బంది బుధవారం స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీజీ ఎస్‌పీఎఫ్‌ ఐజీ స్వాతి లక్రా ఆదేశాలతో యాదగిరి కొండపైన, మెట్ల మార్గం, వైకుంఠద్వారం సమీపంలో చెత్త చెదారాన్ని తొలగించి, పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా ఎస్‌పీఎఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ కె.శేషగిరిరావు మాట్లాడుతూ ఆధ్యాత్మిక ప్రదేశమైన యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు ఎస్‌పీఎఫ్‌ శాఖ సైతం కృషి చేస్తుందన్నారు. రాబోయే రోజుల్లో ఎస్‌పీఎఫ్‌ ఆధ్వర్యంలో మరిన్ని సామాజిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ, ఏఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement