నార్కట్‌పల్లి : బోలేరో వాహనంలో పశువులను అక్రమంగా విజయవాడ నుంచి హైదరాబాద్‌కు తరలిస్తుండగా నార్కట్‌పల్లిలోని ఫ్లైఓవర్‌పై పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన 3 ఆవులు, 5 కోడెలను చిట్యాల గోశాలకు తరలించారు. పశువులను తరలిస్తున్న సత్తెనపల్లి నరసింహారావు, షేక్ అక్రమ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.
లారీని ఢీకొట్టిన గూడ్స్ వాహనం.. ఒకరు మృతి
● మరొకరికి తీవ్ర గాయాలు
నార్కట్‌పల్లి : లారీని గూడ్స్ వాహనం ఢీకొనడంతో ఒకరు మృతిచెందారు. మరొకరికి గాయాలయ్యాయి. ఈ ఘటన నార్కట్‌పల్లి మండలం ఏపీ లింగోటం సమీపంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కట్టంగూర్ మండలం మునుకుంట్లకు చెందిన ఊట్కూరి శ్రవణ్‌కుమార్(23), శాలిగౌరారం మండలం తక్కెళ్లపాడు గ్రామానికి చెందిన భీమనపల్లి యాదగిరి స్నేహితులు. వీరు గూడ్స్ వాహనంలో డెకరేషన్‌కు సంబంధించిన వస్తువులను లోడ్ చేసుకుని నార్కట్‌పల్లి నుంచి తక్కెళ్లపాడుకు వెళ్తున్నారు. మార్గమధ్యలో ఏపీ లింగోటం గ్రామ సమీపంలోకి రాగానే.. సూర్యాపేట వైపు వెళ్తున్న లారీని డ్రైవర్ ఎలాంటి సిగ్నల్ ఇవ్వకుండా రోడ్డు పైనే ఆపాడు. దీంతో గూడ్స్ వాహనం నడుపుతున్న యాదగిరి లారీని చూసి బ్రేక్ వేశాడు. బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శ్రవణ్‌కుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. యాదగిరికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుడి తండ్రి లింగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నార్కట్‌పల్లి ఎస్‌ఐ విష్ణుమూర్తి తెలిపారు.


