భువనగిరి : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ భువనగిరి పట్టణంలోని విద్యుత్ కార్యాలయం వద్ద ఆర్టిజన్లు చేస్తున్న ధర్నా కొనసాగుతోంది. గురువారం తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ ఎంప్లాయీస్ జేఏసీ ఉమ్మడి నల్లగొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వంటావార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుంకు సతీష్‌రెడ్డి, కన్వీనర్ సాయిలు హాజరై మాట్లాడారు. ఆర్టిజన్లకు ఏపీఎస్‌ఈబీ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 7వ తేదీలోపు విద్యుత్ సంస్థ యాజమాన్యం స్పందించకపోతే 8 నుంచి జరిగే సమ్మెలో కార్మికులందరూ పాల్గొంటారని తెలిపారు. కాగా, ధర్నాకు 1104, 327, టీఆర్‌వీకేఎస్, బీసీ అసోసియేషన్, ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శీలంకోటి రాజు, మహేష్, పవన్, మల్లేశం, వెంకటేశం, విష్ణు, భాస్కర్, నర్సింగ్‌రావు, హేమలత, మహేశ్వరి, అనిత పాల్గొన్నారు.
యాదగిరి క్షేత్రంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామునే ఆలయాన్ని తెరిచిన అర్చకులు శ్రీస్వామి వారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం గర్భాలయంలోని మూలవర్యులకు, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు ఆగమ శాస్త్రానుసారంగా, వేద మంత్రాలతో పంచామృతాలతో అభిషేకం చేపట్టారు. తరువాత శ్రీస్వామి అమ్మవార్లకు సహస్రనామార్చన, తులసీ దళాలతో అర్చన వంటి పూజలను జరిపించారు. ఇక ముఖ మండపంలో ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన, అష్టోత్తర పూజలు కొనసాగాయి. ప్రథమ ప్రాకార మండపంలో సంప్రదాయంగా శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలు జరిగాయి. సాయంత్రం వేళ శ్రీస్వామి వారి జోడు సేవోత్సవాన్ని చేపట్టారు.
ప్రభుత్వ వైద్య సేవలను వినియోగించుకోవాలి
మోటకొండూర్ : ప్రభుత్వ వైద్య సేవలను ప్రజలు వినియోగించుకోవాలని టీబీ నియంత్రణ జిల్లా అధికారి డాక్టర్ వంశీకృష్ణ కోరారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం చాడలో నిర్వహించిన ఎన్‌సీడీ టీబీ స్క్రీనింగ్ క్యాంపులో 130 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి మందులు ఇచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల శ్రీనివాస్, ఉప సర్పంచ్ పెల్లిమెల్లి భువనేశ్వర్, డాక్టర్ విజయ్, హరిత, నర్సింహ, శ్రీనివాస్, సైదులు, నటీష్, జ్యోతి, సుభాషిని, అరుణ పాల్గొన్నారు.


