దేవరకొండ: దేవరకొండ పట్టణంలోని ఖిలా ఆవరణలో గల కోట్లబావికి సమీపంలో ఉన్న పెద్ద రాతి బండకు చెక్కి ఉన్న ఆరడుగుల ఎత్తు గల తంత్ర భైరవుడి అర్ధ శిల్పాన్ని కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు యూనస్ ఫర్హాన్ గుర్తించారు. ఈమేరకు శనివారం ఆయన స్థానికంగా మాట్లాడుతూ.. భైరవుని తలపై జ్వాలా మకుటంతో పాటు రెండు నాగులు కిరీటం వలే ఉన్నాయని తెలిపారు. ఛతుర్భుజుడైన భైరవుడి హస్తాలలో ఢమరుకం, త్రిశూలం, నిజ హస్తాలలో కత్తి, రక్త పాత్రలున్నట్లు పేర్కొన్నారు. భైరవుడి శిల్పానికి కుడి వైపున నిలబడి ఉన్న వ్యక్తి భైరవారాధకుడని, ఎడమచేతికి దగ్గరలో మరొక మనిషి భైరవా రాధనలో ఉన్నట్లు తెలిపారు. ఇలాంటి భైరవ శిల్పం ఇటీవల రాచకొండలో గుర్తించినట్లు ఆయన తెలిపారు.


