జాబితా షెడ్యూల్ ఇలా..
సాక్షి, యాదాద్రి : చేనేత సహకార సంఘాల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది. ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు సహకార సంఘాల సభ్యుల ఓటరు జాబితా తయారు చేయాలని షెడ్యూల్ ఖరారు చేసింది. అధికార యంత్రాంగం ఓటరు జాబితా తయారు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అయితే సంఘాల్లో ఎలాంటి అప్పులు లేకుండా ఉన్న సభ్యులకు పోటీ చేసే, ఓటు వేసే హక్కు ఉంటుంది. మొత్తంగా చేనేత ఓటరు జాబితా తయారుకు ప్రభుత్వం షెడ్యూల్ ఖరారు చేయడంతో సహకార సంఘాల్లో ఎన్నికల సందడి మొదలైంది.
2013లో చివరిసారి ఎన్నికలు
రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల ఎన్నికలు 2013 ఫిబ్రవరిలో చివరి సారిగా జరిగాయి. 2018లో వీటి కాల పరిమితి ముగిసింది. ఆ తర్వాత మళ్లీ ఎన్నికలు జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ప్రభుత్వం ఎనిమిది సంవత్సరాల పాటు పాత పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగిస్తూ వచ్చింది. ఈ క్రమంలో మొత్తం 16 సార్లు గడువు పొడిగించింది. చివరిసారి గతనెల (మార్చి) 9 నుంచి మే 10 వరకు పదవీ కాలం పొడిగించారు. కాగా జిల్లాలో పలు సొసైటీల్లో అక్రమాలు జరిగాయని తేలడంతో పీఏసీఎస్ చట్టం సెక్షన్ 51 కింద అధికారులను పర్సన్ ఇన్‌చార్జ్‌లుగా నియమించారు.
24న ఉత్తర్వుల జారీ
చేనేత జౌళి శాఖ కమిషనర్ ఈనెల 24న ఓటరు జాబితా తయారీకి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఓటరు తయారు చేసిన ఓటరు జాబితాలను పక్కన పెట్టారు. చనిపోయిన వారు, డిఫాల్టర్‌లు, (సొసైటీకి నగదు, లేక వస్తు రూపంలో బకాయి ఉంటే) 90 రోజుల కంటే ఎక్కువ బకాయి పడి ఉంటే డిఫాల్టర్‌గా పరిగణించి ఓటరుగా తొలగిస్తారు. అయితే –సభ్యులు ఓటు హక్కు కలిగి ఉండాలంటే సహకార సంఘానికి ఏమైనా బకాయిలు ఉంటే ఏప్రిల్ 13వ తేదీలోపు చెల్లించాలని గడువు విధించారు.
ఓటరు జాబితా రూపకల్పనకు షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం
ఫ ఏప్రిల్ 4 నుంచి మే 15 వరకు తయారీ గడువు
ఫ డిఫాల్టర్లకు ఓటుహక్కు తొలగించే అవకాశం
ఫ చనిపోయిన వారి పేర్లు తొలగించాలని జౌళి శాఖకు ఆదేశం
ఫ ఉమ్మడి జిల్లాలోని 81 సంఘాల్లో 25,800 మంది సభ్యులు
ఏప్రిల్ 15నుంచి 17 వరకు మూడు రోజుల పాటు చేనేతజౌళి శాఖ అధికారులు సహకార సంఘాల వారీగా ఓటరు జాబితా తయారు చేస్తారు.
ఏప్రిల్ 18 నుంచి 25 వరకు ఏడు రోజులపాటు సహకార సంఘాల నోటీస్ బోర్డులపై ఓటరు జాబితా ప్రదర్శిస్తారు.
ఏప్రిల్ 27 నుంచి 29 వరకు సభ్యుల నుంచి అభ్యంతరాలు స్వీకరించి సవరిస్తారు.
ఏప్రిల్ 30 నుంచి మే 1వరకు సంఘాల వారీగా జాబితాలను జిల్లా రిజిస్ట్రార్‌కు అందజేస్తారు.
మే 2 నుంచి 5 వరకు జిల్లా ఏడీ కార్యాలయంలో ఓటరు జాబితా పరిశీలిస్తారు.
మే 6నుంచి 8 వరకు సంఘ నోటీస్ బోర్డుపై సవరించిన ఓటరు జాబితా ప్రదర్శన, జిల్లా రిజిస్ట్రార్‌చే అభ్యంతరాల స్వీకరణ.
మే 11 నుంచి 12 వరకు సవరించి సంతకం చేసిన ఓటరు జాబితా జిల్లా ఏడీ కార్యాలయంలో అందజేస్తారు.
మే 13 నుంచి 15 వరకు రాష్ట్ర కోఆపరేటివ్ ఎన్నికల సంఘానికి ఓటరు జాబితా అందించాల్సి ఉంటుంది.
చేనేత, పవర్‌లూమ్,
సహకార సంఘాలు, సభ్యులు
జిల్లా సంఘాలు సభ్యులు
యాదాద్రి 48 18,882
నల్లగొండ 30 6,588
సూర్యాపేట 03 330


