మోత్కూరు : పెండింగ్‌లో ఉన్న పాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన పాడి రైతులు శనివారం మోత్కూరులోని పాల శీతలీకరణ కేంద్రం గేటు బంద్ చేసి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఐదు నెలలుగా పది బిల్లులకు సంబంధించి సుమారు రూ.8 లక్షలు రావాల్సి ఉందన్నారు. నెలల తరబడి బిల్లులు పెండింగ్‌లో ఉంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. పాల శీతలీకరణ కేంద్రం మేనేజర్ ఉమా మహేశ్వర్ మాట్లాడుతూ.. కేంద్రం పరిధిలో సుమారు రూ.1.25 కోట్ల బిల్లులు రావాల్సి ఉందన్నారు. ఈ నెల 31 నుంచి బిల్లులు వేస్తారని, 15 రోజుల్లో పూర్తి స్థాయిలో బిల్లుల చెల్లింపులు జరుగుతాయని ఉన్నతాధికారులు తెలిపినట్లు ఆయన చెప్పారు. దీంతో పాడి రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో పైళ్ల వెంకట్‌రెడ్డి, తండ వీరస్వామి, నోముల శేఖర్, మిర్యాల శ్రీశైలం, పైళ్ల నర్సిరెడ్డి, బిల్లకంటి ఆంజనేయులు, భీమిడి రాంరెడ్డి, మర్రి సురేష్, యాదయ్య, కొణతం సుదర్శన్‌రెడ్డి, కాకులారపు రంగారెడ్డి పాల్గొన్నారు.


