మోత్కూరు : తనకు రావాల్సిన అప్పు డబ్బులు ఇవ్వాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని సదరు వ్యక్తి ఇంటి ఎదుట నిరసన తెలిపాడు. వివరాలిలా ఉన్నాయి. మోత్కూరు మండలం ముశిపట్ల గ్రామానికి చెందిన కోమటిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి మోత్కూరుకు చెందిన గుండగోని రామచంద్రు గౌడ్‌కు 2022లో రూ.15 లక్షలు అప్పుగా ఇచ్చాడు. 2023లో రామచంద్రు గౌడ్ తిరిగి రూ.10 లక్షలు ప్రభాకర్‌రెడ్డికి ఇచ్చాడు. మరో రూ.5 లక్షలు ఆరు నెలలకు ఇస్తానని పత్రం రాయించుకున్నాడు. రోజులు గడుస్తున్నా రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ప్రభాకర్‌రెడ్డి వాపోయాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని రామచంద్రును ఎంత బతిమిలాడినా పట్టించుకోకపోవడంతో బుధవారం అతడి ఇంటి ఎదుట ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు వివరించాడు. అయితే ఈ సమయంలో రామచంద్రు ఇంటికి తాళం వేసి ఉన్నది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయంపై రామచంద్రు స్పందిస్తూ.. తాను రూ.15 లక్షలు అప్పు తీసుకున్నానని, రూ.10 లక్షలు తిరిగి చెల్లించానని పేర్కొన్నాడు. మరికొంత నగదు చెల్లించాల్సి ఉందని తెలిపాడు. తాను ఇబ్బందుల్లో ఉన్నానని, ఇస్తానని హామీ ఇచ్చినప్పటికీ ప్రభాకర్‌రెడ్డి గొడవ చేస్తున్నాడని పేర్కొన్నాడు.


