భువనగిరిటౌన్ : జిల్లా కేంద్రంలోని తీరందాస్ గోపి మీటింగ్ హాల్‌లో పీపుల్స్ ప్రోగ్రెస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రగతి విద్యానికేతన్ పరీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రశ్న పత్రాలను తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (టీఎస్ యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు ముక్కెర్ల యాదయ్య, ప్రధాన కార్యదర్శి మెతుకు సైదులు ఆవిష్కరించారు. వారు మాట్లాడుతూ.. కొన్ని దశాబ్దాలుగా రాష్ట్రంలోని అనాథ, పాక్షిక అనాథ, నిరుపేద విద్యార్థులకు ఉచితంగా హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌లో రెసిడెన్షియల్ విద్యను అందించనున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకున్న వారు, జనగాం, నిజామాబాద్ విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరయ్యారని పేర్కొన్నారు. వారం లోపు ఫలితాలను వెల్లడిస్తారని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా ఆడిట్ కమిటీ సభ్యులు గుజ్జ బాలయ్య, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి లావుడియా రాజు, పీపీటీ పరీక్ష పరిశీలకులు ప్రగతి, శ్రీవాణి , జిల్లా కమిటీ సభ్యులు కంచిగట్ల వెంకన్న, కోక వేణు తదితరులు పాల్గొన్నారు.
యాదగిరీశుడి ఆలయంలో సంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో ఆదివారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. స్వయంభూలకు నిజాభిషేకం, బిందె తీర్థం, ఆరాధన, అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ముఖ మండపంలోని ఉత్సవ మూర్తులకు సువర్ణ పుష్పార్చన పూజ విశేషంగా నిర్వహించారు. ప్రథమ ప్రాకార మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి పూజలను జరిపించారు. సాయంత్రం ఆలయంలో జోడు సేవను ఊరేగించారు. రాత్రి శయనోత్సవం నిర్వహించి, ఆలయాన్ని ద్వార బంధనం చేశారు.


