మరో మూడు ప్రాజెక్టులకు..
సాక్షి, యాదాద్రి : జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల విస్తరణ వేగవంతమైంది. ముఖ్యంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొలనుపాకకు చేరువలో ఉన్న ఆలేరు రైల్వే స్టేషన్‌ను యాత్ర స్పెషల్ స్టేషన్‌గా తీర్చిదిద్దేందుకు రైల్వే శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది.
రెండున్నర ఎకరాల భూసేకరణ
ఆలేరు రైల్వే స్టేషన్ ఆధునీకరణ, అదనపు లైన్ల నిర్మాణం కోసం ఆలేరు పట్టణ పరిధిలో సుమారు 2.20 ఎకరాల ప్రైవేట్ భూమిని సేకరించనున్నారు. ఇందులో ఇళ్లు, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ, వ్యవసాయేతర భూములు ఉన్నాయి. భూ సేకరణ బాధ్యతలను రెవెన్యూ శాఖకు అప్పగించగా ఆ శాఖ అధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి, సమగ్ర నివేదికను రూపొందించారు. సేకరించిన భూములకు మార్కెట్ విలువ ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించనుంది.
కొత్తగా మూడో ప్లాట్‌ఫాం నిర్మాణం
ప్రస్తుతం ఉన్న రెండు ప్లాట్‌ఫాంలకు అదనంగా, కొలనుపాక రోడ్డు వైపు మూడవ ప్లాట్‌ఫాంను నిర్మించనున్నారు. దీనికోసం కొత్తగా లూప్ లైన్లు, డౌన్ లైన్ ట్రాక్‌లతో పాటు అత్యాధునిక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తారు. దీంతోపాటు ఇప్పటికే సికింద్రాబాద్ – ఖాజీపేట మార్గంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు వంగపల్లి నుంచి ఆలేరు మీదుగా పెంబర్తి వరకు అదనంగా 3వ, 4వ రైల్వే లైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ఆలేరు వరకు ప్రస్తుతం రైల్వే సరిహద్దులోనే ఈ రెండు లైన్లు వచ్చే అవకాశం ఉంది. అయితే ఆలేరు పట్టణంలోని రత్నాల వాగు నుంచి అదనపు భూ సేకరణ చేసే అవకాశం ఉంది. ఆలేరు వాగు మీదుగా పెంబర్తి వరకు అదనపు లైన్లు నిర్మిస్తారు.
ఆలేరుతో పాటు జిల్లాలో మరో మూడు కీలక ప్రాజెక్టుల కోసం భూసేకరణ సాగుతోంది. ఇందులో భాగంగా బీబీనగర్ మండలం కొండమడుగు నుంచి భువనగిరి, రాయిగిరి మీదుగా వంగపల్లి వరకు ఎంఎంటీఎస్ కోసం 46 ఎకరాలు సేకరిస్తున్నారు. అలాగే బీబీనగర్–నడికుడి మార్గంలో డబ్లింగ్ పనులకు రామన్నపేట వరకు 23 ఎకరాలు, పగిడిపల్లి వద్ద రైల్వే రైల్వే ఓవర్ లైన్ కోసం 16 ఎకరాల భూసేకరణ ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ఇందులో భాగంగా డబ్లింగ్ పనులు, రైల్వే ఆర్‌వోఆర్ బ్రిడ్జిల నిర్మాణాలు కూడా చేపడతారు.
ఫ 2.20 ఎకరాల భూసేకరణకు సన్నద్ధం
ఫ కొలనుపాక భక్తులకు పెరగనున్న సౌకర్యాలు
ఫ మరో మూడు ప్రాజెక్టులకూ భూ సేకరణ


