వేర్వేరు కారణాలతో ఐదుగురు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

వేర్వేరు కారణాలతో ఐదుగురు ఆత్మహత్య

Feb 21 2026 8:15 AM | Updated on Feb 21 2026 8:15 AM

వేర్వేరు కారణాలతో ఐదుగురు ఆత్మహత్య

వేర్వేరు కారణాలతో ఐదుగురు ఆత్మహత్య

వరిగడ్డి మిషన్‌ కొనివ్వలేదని.. ఆర్థిక ఇబ్బందులతో రైతు బలవన్మరణం

తల్లిదండ్రులు మందలించారని..

ఉమ్మడి జిల్లాలో వేర్వేరు కారణాలతో ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కోదాడలో మండలంలో ఇద్దరు, తిప్పర్తి మండలంలో ఒకరు, నకిరేకల్‌ మండలంలో ఇద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆయా ఘటనలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

కోదాడరూరల్‌ : కోదాడ పట్టణంలోని గణేష్‌నగర్‌లో కుటుంబ కలహాలతో శుక్రవారం ఓ వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం లక్కవరం గ్రామానికి చెందిన కుక్కల కృష్ణ(39) గత కొంత కాలంగా కోదాడ పట్టణంలో అద్దె ఇంటిలో ఉంటూ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబంతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. పనిచేయకపోవడంతో భార్యతో గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో కృష్ణ శుక్రవారం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతుడి బావ సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కోదాడరూరల్‌ : వరిగడ్డి కట్టే మిషన్‌ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కోదాడ మండలంలోని గణపవరం గ్రామంలో చోటుచేసుకుంది. గణపవరం గ్రామానికి చెందిన పసుపులేటి నాగరాజు(23) తన తండ్రి లక్ష్మయ్యను ట్రాక్టర్‌తో వరిగడ్డి కట్టే మిషన్‌ కొనివ్వాలని అడిగాడు. ట్రాక్టర్‌ కొన్న అప్పులే తీరలేదు ఇప్పుడు వద్దు తర్వాత కొందామని తండ్రి చెప్పాడు. దీంతో మనస్థాపం చెందిన నాగరాజు ఈ నెల 9న ఎలుకల మందు తాగాడు. చికిత్స నిమిత్తం ఖమ్మంలోని ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. తండ్రి లక్ష్మ య్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ సీహెచ్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు.

తిప్పర్తి: ఆర్థిక ఇబ్బందులతో రైతు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈఘటన తిప్పర్తి మండలంలోని మామిడాల గ్రామంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. తిప్పర్తి ఎస్సై శంకర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనుములపురి సంపత్‌ (24) గ్రామంలో గత కొంతకాలంగా 16ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. దిగుబడులు సరిగ్గా రాక వ్యవసాయం కోసం రూ.8లక్షల వరకు అప్పు చేశాడు. వీటిని తీర్చలేనేమోనని మనస్థాపానికి గురైన సంపత్‌ వ్యవసాయ బావి వద్ద చెట్టుకు ఉరి వేసుకున్నాడు. తన కుమారుడు ఇంటికి రాక పోవడంతో తండ్రి వెతుక్కుంటూ పొలం దగ్గరకి వెళ్లగా అక్కడే చెట్టుకు కుమారుడు వేలాడుతూ కనిపించాడు. మృతుడి తండ్రి సైదులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తిప్పర్తి ఎస్సై శంకర్‌ తెలిపారు.

మతిస్థిమితం కోల్పోయిన మహిళ..

నకిరేకల్‌: మతిస్థిమితం కోల్పోయి ఒంటరిగా ఉంటున్న మహిళ ఒంటిపై పెట్రోల్‌ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన నకిరేకల్‌ మండలం తెట్టకుంట గ్రామంలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ మండలం చందనపల్లి గ్రామానికి చెందిన జంజిరాల నర్సమ్మ ఒంటరిగా ఉంటూ జీవనం సాగిస్తోంది. మతిస్థిమితం కోల్పోయింది. శుక్రవారం రాత్రి తన సమీప గ్రామమైన నకిరేకల్‌ మండలం తాటికల్లు శివారులోని తెట్టకుంట గ్రామానికి చేరుకుని బాటిల్‌లో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ను ఒంటిపై పోసుకొని నిప్పంటించుకుంది. మృతురాలి కుటుంబసభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరిబాబు తెలిపారు.

నకిరేకల్‌ : తల్లిదండ్రులు మందలించారని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నకిరేకల్‌ మండలం మండలాపురం గ్రామానికి చెందిన తీగల నాగయ్య, సైదమ్మలకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మహేష్‌( 20) మర్రూర్‌ గ్రామంలోని పెట్రోల్‌ బంక్‌లో పంప్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. మహేష్‌ మద్యానికి బానిస కావడంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మహేష్‌ ఈనెల 3న ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగాడు. అపస్మారక స్థితితో ఉన్న అతడిని కుటుంబసభ్యులు గమనించి వెంటనే నకిరేకల్‌ ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తీసుకెళ్లగా.. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. మృతుడి బాబాయి తీగల భాస్కర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హరిబాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement