జీఓ సవరించకుండా రేషనలైజేషన్ సరికాదు
సూర్యాపేటటౌన్ : జీఓ నంబర్ 25ను సవరించకుండా ఉపాధ్యాయుల రేషనలైజేషన్ చేయడం సరికాదని తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు చక్రధర్‌రావు అన్నారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పబ్బతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన ఆదివారం స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. 60మంది విద్యార్థులకు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండటం శాసీ్త్రయం కాదని, ప్రభుత్వం రకరకాల జీఓలతో ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలని చూస్తోందని అన్నారు. విద్యారంగంలోకి కార్పొరేట్ వ్యవస్థను తీసుకురావాలని చూస్తే తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తుందని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులు రాకపోవడానికి గల కారణాలను శాసీ్త్రయంగా విశ్లేషణ చేయాలని, విద్యారంగానికి బడ్జెట్ పెంచాలని, ప్రతి గ్రామంలో పాఠశాలలతో పాటు ప్రతి తరగతికి ఒక గది, ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయుడు ఉండేలాగా చూడాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా విద్యా పరిరక్షణ కమిటీ శాఖను ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా డేగల జనార్దన్, అధ్యక్షుడిగా పబ్బతి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శిగా పుప్పాల వీరన్న, అసోసియేట్ ఉపాధ్యక్షులుగా షేక్ సుభాని, అసోసియేట్ ప్రధాన కార్యదర్శిగా యోగానంద చారిలను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.సోమయ్య, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ కార్యదర్శి రవిచంద్ర, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణారెడ్డి, డీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. లింగయ్య, రాష్ట్ర కమిటీ సభ్యులు సీహెచ్. వెంకటేశ్వర్లు, టీపీటీఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు రామ నరసయ్య, వీరయ్య, డీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె. వేణు తదితరులు పాల్గొన్నారు.
వృద్ధురాలి మెడలో పుస్తెలతాడు అపహరణ
మునుగోడు: వ్యవసాయ బావి వద్ద చింతపండు ఏరుకుంటున్న వృద్ధురాలిని మాటల్లో పెట్టి ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడును ఇద్దరు దుండగులు అపహరించారు. ఈ ఘటన ఆదివారం మునుగోడు మండలం పలివెల గ్రామంలో జరిగింది. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పలివెల అదే గ్రామానికి చెందిన కొరుపోలు వెంకటమ్మ ఆదివారం మధ్యాహ్నం తమ వ్యవసాయ బావి వద్ద చింతచెట్టు కింద చింతపండు ఏరుకుంటుండగా.. మునుగోడు నుంచి కారులో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు అటుగా వెళ్తూ ఆమెను గమనించి కొంతదూరం వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చారు. వారిద్దరిలో ఒకరు ‘పెద్దమ్మా.. మాకు కొంచెం చింతపండు పెడతావా’ అని అడగగా.. ‘రోడ్డు పక్కనే ఉన్న కవర్ తెచ్చివ్వు పెడుతాను’ అని చెప్పింది. వారు కవర్ ఇవ్వడంతో వెంకటమ్మ ఆ కవర్ తీసుకొని వంగి చింతపండు ఏరుతుండగా ఆమె మెడలోని రెండు తులాల బంగారు పుస్తెలతాడుని లాక్కోని అక్కడి నుంచి పరారయ్యారు. ఆమె కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు, వెంకటమ్మ కుమారులు దుండగులను వెంబడించినా పట్టుకోలేకపోయారు. కారు నంబర్ ప్లేట్‌పై తెలుపు రంగు స్టిక్కర్ అంటించిన్నట్లు తెలిపారు. బాధితురాలి కుమారుడు అశోక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


