తల్లిదండ్రుల మృతితో అనాథలుగా బాలికలు
యాదగిరిగుట్ట రూరల్ : గతంలో తండ్రి, ఇప్పడు తల్లి మృతిచెందడంతో యాదగిరిగుట్ట మండలంలోని చిన్న గౌరాయపల్లి గ్రామంలో ఇద్దరు బాలికలు అనాథలయ్యారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గౌరాయపల్లి గ్రామానికి చెందిన గుజ్జ రాధ (30), రాజుకు 20 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. రాజు అంధుడు కాగా.. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె సంకీర్తన 7వ తరగతి, చిన్న కుమార్తె వర్షిణి 5వ తరగతి చదువుతోంది. రాజుకు వచ్చే పెన్షన్‌తో పాటు, రాధ కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. మూడేళ్ల రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి రాధ కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. అయితే ఆరోగ్యం బాగోలేక రాధ కూడా బుధవారం మృతి చెందింది. దీంతో ఆమె ఇద్దరు కుమార్తెలు అనాథలుగా మారారు. రాజుకు కుటుంబ సభ్యులు ఎవరూ లేకపోవడం, రాధ తల్లి వృద్ధురాలు కావడంతో పిల్లల జీవతం ప్రశ్నార్ధకంగా మారింది.
గ్రామస్తుల సహకారంతో అంత్యక్రియలు
నిరుపేద కుటుంబం కావడంతో రాధ అంత్యక్రియలను గ్రామస్తులు తలా ఓ చేయి వేసి జరిపించారు. చిన్న కుమార్తె వర్షిణి తలకొరివి పెట్టింది. అనాథలుగా మారిన చిన్నారులను చూసి గ్రామస్తులు కంటతడి పెట్టారు.


