బంగారం చోరీ కేసులో ముగ్గురు మహిళల అరెస్టు
సూర్యాపేటటౌన్ : ఇంట్లో ఒంటరిగా ఉంటున్న వృద్ధురాలి మెడలోని బంగారు నల్లపూసల గొలుసును అపహరించిన ముగ్గురు మహిళలను సూర్యాపేట రూరల్ పోలీస్‌లు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బుధవారం సూర్యాపేట రూరల్ సీఐ రాజశేఖర్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట మండలంలోని కేసారం గ్రామానికి చెందిన వృద్ధురాలు మెంతమైన బుచ్చమ్మ ఒంటరిగా జీవనం సాగిస్తోంది. ఈ నెల 19న బుచ్చమ్మ ఇంట్లో ఉండగా.. ముగ్గురు మహిళలు వచ్చి ఆమె మెడలోని బంగారు నల్లపూసల గొలుసును లాక్కోని వెళ్లారు. బాధితురాలి కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సూర్యాపేట మండలం రామ్లతండాకు చెందిన వాంకుడోతు పద్మ, వాంకుడోత్ నీలమ్మ, జాటోతు చిలకమ్మ చోరీ చేసినట్లు గుర్తించి వారిని పట్టుకుని బుధవారం రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రూరల్ ఎస్‌ఐ బాలునాయక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


