పుస్తెలతాడు చోరీ చేసిన నిందితుల అరెస్టు
నూతనకల్ : మహిళ మెడలో నుంచి పుస్తెలతాడు అపహరించిన నిందితులను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సీఐ నర్సింహారావు తెలిపిన వివరాల ప్రకారం.. నూతనకల్ మండలం బిక్కుమళ్ల గ్రామానికి చెందిన ఇటికాల వెంకటమ్మ 365వ నంబర్ జాతీయ రహదారి వెంట కల్లు అమ్ముకొని జీవనం కొనసాగిస్తుంది. ఈ నెల 12న ఇద్దరు వ్యక్తులు వెంకటమ్మ దగ్గరకు వచ్చి కల్లు తాగి ఆమె మెడలో ఉన్న మూడు తులాల బంగారు పుస్తెలతాడును లాక్కెళ్లారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సోమవారం ఎర్రపహాడ్ క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేస్తుండగా.. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన కట్టరి యువరాజ్, దామల రాజేష్ అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. పుస్తెలతాడు లాక్కెళ్లినట్లు నేరం అంగీకరించారు. వారి నుంచి పుస్తెలతాడు రికవరీ చేసి నిందితులను రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే సమాచారం ఇవ్వాలి
● భువనగిరి ఎస్పీ అక్షాంశ్ యాదవ్
భువనగిరి: సెల్‌ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని భువనగిరి జిల్లా ఎస్పీ అక్షాంశ్ యాదవ్ అన్నారు. వివిధ కేసుల్లో పోలీసులు రికవరీ చేసిన 113 సెల్‌ఫోన్లును బాధితులకు సోమవారం తన కార్యాలయంలో ఎస్పీ అప్పగించి మాట్లాడారు. ఫోన్లలో విలువైన సమాచారం పోగొట్టుకోకుండా ఎప్పటికప్పుడు బ్యాకప్ చేసుకోవాలన్నారు. దొంగిలించబడిన ఫోన్లను అమ్మడం మాత్రమే కాదు కొనడం కూడా నేరమే అని అన్నారు. రద్దీగా ఉన్న ప్రదేశాల్లో సెల్‌ఫోన్లను జాగ్రత్తగా భద్రపర్చుకోవాలని సూచించారు. సెల్‌ఫోన్లను రికవరీ చేయడంలో సీసీఎస్ పోలీసులు చేసిన కృషిని ఆయన ఆభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ లక్ష్మీనారాయణ, సీసీఎస్ బృందం, పోలీసులు పాల్గొన్నారు.
పుస్తెలతాడు చోరీ చేసిన నిందితుల అరెస్టు


