‘వంగ’లో తెగుళ్లు – నివారణ చర్యలు
త్రిపురారం : చలికాలంలో వంగ సాగులో ఎప్పటికప్పుడు సస్యరక్షణ చర్యలు చేపడితేనే అధిక దిగుబడులు సాధించవ్చని, చీడపీడల ఉధృతి ఎక్కువ కాకుండా ఉంటుందని కంపాసాగర్ కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే) ప్రోగ్రాం కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచిస్తున్నారు. వంగ తోటను ఆశించే చీడపీడలు వాటి నివారణ చర్యలు ఆయన మాటల్లోనే..
వెర్రి తెగులు : వెర్రి తెగులు సోకడం వలన ఆకులు సన్నగా మారి పాలిపోయిన ఆకుపచ్చని రంగు కలిగి ఉంటాయి. మొక్కలు గుబురుగా చీపురు కట్టల్లా కనబడతాయి. పూత, కాత లేకుండా మొక్కలు గొడ్డు బారిపోతాయి. ఇది వైరస్ తెగులు కావడంతో ఆశించిన మొక్కలను తొలగించి నాశనం చేయాల్సి ఉంటుంది.
1. నారు దశలో నాటడానికి ముందు 250 గ్రామలు కార్బోఫ్యూరాన్ గుళికలను 100 చ.మీ. నారు మడికి వేసుకోవాలి.
2. ప్రధానంగా కాత సమయంలో పురుగు ఆశించిన కాయలు, కొమ్మలను తుంచి నాశనం చేయాలి.
3. తల నత్త ఆశించిన కొమ్మలను పురుగు ఆశించని ప్రాంతం నుంచి ఒక అంగుళం కిందకు తుంచి నాశనం చేయాలి.
4. అల్లిక రెక్కల పురుగులను మొక్కకు రెండు చొప్పున పంట పెరిగే దశలో విడుదల చేయాలి.
5. ఎకరానికి 200 కిలోల వేప పిండి దుక్కిలో వేసుకోవాలి.
6. అంతర పంటలుగా బంతి, ఉల్లి, వెల్లుల్లి పంటలు వేసుకోవాలి.
కాయకుళ్లు తెగులు : ఈ తెగులు సోకితే మొక్క ఆకుపై అక్కడక్కడ గోధుమ రంగులో మచ్చలు కనిపిస్తాయి. ఈ తెగులు ఉధృతమైతే ఆకులు రాలిపోతాయి. తెగులు సోకిన కాయలు పసుపు రంగులోకి మారి కుళ్లిపోతాయి. ఈ తెగులు నివారణకు నారు మడిలో విత్తే ముందు 50 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కలిగిన నీటిలో విత్తనాలను 30 నిమిషాల పాటు నానబెట్టి విత్తుకోవాలి. తెగులు సోకిన పొలంలో పంట మార్పిడి తప్పనిసరిగా పాటించాలి. కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాముల మందును లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 నుంచి 3 సార్లు పిచికారీ చేసుకోవాలి.
ఆకుమాడు తెగులు : నారును పొలంలో నాటిన 30 రోజులకు ఈ తెగులు ఆశిస్తుంది. ఆకులు అన్ని మాడిపోయినట్లు కనిపిస్తాయి. ఈ తెగులు ఆశించినప్పుడు ఆకులపై గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. తరువాత పసుపు రంగులోకి మారి వాడి రాలిపోతాయి. తేమతో కూడిన చల్లటి వాతావరణంలో ఈ తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లేదా మాంకోబెజ్ 2.5 గ్రాములు లేదా కార్బెండిజమ్ 1 గ్రాము లీటరు నీటికి కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి.
ఎర్రనల్లి : ఎర్రనల్లి తెగులుకు కారణమయ్యే పురుగు ఆకుల అడుగు భాగాన చేరి రసం పీల్చడం వల్ల ఆకులు పాలిపోయి తెల్లగా మారుతాయి. ఆకులపై సాలెగూడు వంటి తీగలు ఏర్పడతాయి. దీని నివారణకు లీటరు నీటికి నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు లేదా డైకోపాల్ 5 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
రసం పీల్చే పురుగులు : ఈ పురుగులు ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చి వేయడం వల్ల ఆకులు పసుపు రంగుగా మారి ముడుచుకొని ఎండిపోతాయి. దీని నివారణకు డైమీథోఝెట్ లేదా మిథైల్‌డెమటాస్ లేదా ఫిఫ్రోనిల్ లీటరు నీటికి 2.మి.లీ. చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి.
మొవ్వ, కాయ తొలుచు పురుగు : ఈ పురుగు పంట నాటిన 3 నుంచి 40 రోజుల కాలంలో ఆశిస్తుంది. మొక్క పెరుగుదల దశలో మువ్వను తరువాత దశలో కాయలను తొలిచి నష్టాన్ని కలుగజేస్తాయి. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్మల చివర్లో పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకుగాను ఈ పురుగు ఆశించిన కొమ్మలను తుంచి వేయాలి. తొలి దశలో వేప నూనె లీటరు నీటికి 5 మి.లీ. లేదా కార్భరిల్ 50 శాతం 3 గ్రాములు లీటరు నీటికి లేదా ప్రోఫెనోపాస్ 2 మి.లీ. లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
సేంద్రియ ఎరువులతోనూ
తెగుళ్ల నివారణ
సేంద్రియ ఎరువులు ఉపయోగించి పండించిన కూరగాయలకు మార్కెట్‌లో అధిక డిమాండ్ ఉంటుంది. సేంద్రియ పద్ధతిలో తెగుళ్ల నివారణకు నిమ్మ నూనె, వేప గంజల కషాయం, దశపర్ణి కషాయం, వేప వేళ్ల కషాయం పిచికారీ చేయడంతో పాటు మిత్ర పురుగులు వదలడం వంటివి పాటించవచ్చు. అలాగే గో ఆధారిత జీవామృతం, ఘన జీవామృతం, పంచగవ్వ, బీజామృతం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మస్త్రం వంటివి వాడవచ్చు.
కంపాసాగర్ కేవీకే ప్రోగ్రాం
కోఆర్డినేటర్ చంద్రశేఖర్ సూచనలు
‘వంగ’లో తెగుళ్లు – నివారణ చర్యలు


