సారొచ్చారు.. సరిదిద్దారు
హాలియా : పాఠాలు చెప్పే గురువులు చాలా మంది ఉంటారు. కానీ విద్యార్థుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచే గురువులు అరుదుగా ఉంటారు. అదే కోవకు చెందుతారు హాలియా పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కామర్స్ లెక్చరర్ వర్కాల ఆదిరెడ్డి. తనకు వృత్తి పట్ల అంకితభావంతో మూతపడే దశలో ఉన్న కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచుతూ.. వినూత్న పద్ధతుల్లో పాఠాలు బోధిస్తూ అధ్యాపక వృత్తికే ఆయన వన్నె తెస్తున్నారు. వ్యవసాయ కుటుంబంలో పుట్టిన వర్కాల ఆదిరెడ్డి ఇంటర్ హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో, డిగ్రీ నల్లగొండలోని ఎన్‌జీ కళాశాలలో, వరంగల్‌లోని కాకతీయ యూనివర్సిటీలో పీజీ పూర్తి చేశారు. 2005లో తాను ఇంటర్ చదువుకున్న హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలోనే కాంట్రాక్టు అధ్యాపకుడిగా చేరారు. ప్రస్తుతం ఆయన రెగ్యులర్ అధ్యాపకుడిగా కొనసాగుతున్నారు.
50 నుంచి 500 వరకు..
వర్కాల ఆదిరెడ్డి కామర్స్ లెక్చరర్‌గా 2005లో హాలియా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరిన సమయంలో మొత్తం 50 మంది విద్యార్థులు ఉన్నారు. మొదటి సంవత్సరం సీఈసీలో ఒక్క విద్యార్థి కూడా లేరు. ద్వితీయ సంవత్సరం సీఈసీలో ఐదుగురు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. దాదాపు ఆ కళాశాల మూతబడే స్థితిలో ఉంది. దీంతో ఆయన తోటి అధ్యాపకులతో కలిసి ఇంటింటికి తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడి రెండేళ్ల పాటు శ్రమించి కళాశాలలో విద్యార్థుల సంఖ్య 500కు చేరేలా ప్రత్యేక దృష్టి సారించారు.
దాతల సహకారంతో మధ్యాహ్న భోజనం..
అంతేకాకుండా హాలియా లయన్స్ క్లబ్, స్థానిక నాయకులు మలిగిరెడ్డి లింగారెడ్డి, ఎన్నారై వింజం రాంబాబు, రిక్కల ఇంద్రసేనారెడ్డి, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి వంటి దాతల సహకారంతో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేలా ఆదిరెడ్డి ఏర్పాట్లు చేశారు. దీంతో హాలియాలోని ప్రైవేట్ కళాశాలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు 90శాతంకు పైగా ఉత్తీర్ణత సాధించడంతో అప్పటి ప్రిన్సిపాల్ వెంగళ్‌రావు దివంగత ముఖ్యమంత్రి చేతులమీదుగా రాష్ట్రంలోనే ఉత్తమ ప్రిన్సిపాల్‌గా అవార్డు అందుకున్నారు. అదేవిధంగా వాసవి క్లబ్ ఆధ్వర్యంలో కళాశాల గ్రంథాలయానికి రూ.5వేల విలువైన పుస్తకాలు, ప్రస్తుత నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి సహకారంతో విద్యార్థుల కోసం 200 బెంచీలు ఏర్పాటు చేయించారు. దాతల సహకారంతో విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందేలా కృషిచేశారు. ప్రస్తుతం ఈ కళాశాలలో 242 మంది విద్యార్థులు ఇంటర్ విద్యనభ్యసిస్తున్నారు.
మూతబడే స్థితిలో ఉన్న హాలియా జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచిన కామర్స్ లెక్చరర్
తాను చదువుకున్న కళాశాలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు కృషి


