చేసిన పనులకు బిల్లులు రాక..
వలిగొండ : పాఠశాల అభివృద్ధికి పనులు చేసి బిల్లులు రాకపోవడంతో విసుగు చెందిన మాజీ సర్పంచ్ పాఠశాల గేటుకు తాళం వేశాడు. ఈ ఘటన వలిగొండ మండలం సంగెం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. 2023లో అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం మన ఊరు–మన బడి కార్యక్రమంలో భాగంగా సంగెం గ్రామంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో డైనింగ్ హాల్ కిచెన్ షెడ్డు, వాటర్ ట్యాంకులు, ప్రహరీ నిర్మాణానికి రూ.28,31,715, ప్రైమరీ పాఠశాల ప్రహరీ నిర్మాణానికి రూ.5.28లక్షలు మంజూరు చేసింది. అప్పటి సర్పంచ్ కీసరి రాంరెడ్డి అతడి భార్య మణెమ్మ పేరున వర్క్ ఆర్డర్ తీసుకుని అధికారులు ఇచ్చిన సమయానికే పనులు పూర్తిచేసి ఎంబీ రికార్డులు కూడా పూర్తిచేశారు. ఆ సమయంలో అధికారులు రూ.5లక్షలు మాత్రమే బిల్లులు చెల్లించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన పనులకు బిల్లులు రాక రాంరెడ్డి ప్రభుత్వ కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేదు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడంతో తాము ఏమీ చేయలేమని చేతులు ఎత్తేశారు. అధికారుల చుట్టూ తిరిగి విసిగిపోయిన రాంరెడ్డి సోమవారం పాఠశాల గేటుకు తాళం వేశాడు. దీంతో ప్రత్యేక క్లాసుల కోసం వచ్చిన 10వ తరగతి విద్యార్థులకు పాఠశాల గేటు బయట ఆగిపోయారు. కొందరు గ్రామస్తులు జిల్లా కలెక్టర్‌ను కలిసి సమస్యను తెలుపుదామని సముదాయించడంతో రాంరెడ్డి గేటుకు తాళం తీశారు. దీంతో పాఠశాల యథావిధిగా కొనసాగింది.
పాఠశాల గేటుకు తాళం వేసిన
మాజీ సర్పంచ్


