నకిరేకల్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా
నల్లగొండ టూటౌన్ : నకిరేకల్ నియోజకవర్గంలో గత రెండేళ్లలో చేసిన అభివృద్ధిపై చర్చకు రావాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రస్తుత ఎమ్మెల్యే వేముల వీరేశంకు సవాల్ విసిరారు. గురువారం నల్లగొండ పట్టణంలోని బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో చిరుమర్తి లింగయ్య విలేకరులతో మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ హయాంలో తాను మంజూరు చేయించిన పనులకు ప్రస్తుత ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తూ రెండేళ్ల నుంచి పబ్బం గడపడం తప్ప కొత్తగా చేసింది ఏమిటో చెప్పాలన్నారు. గత 25 ఏళ్ల నుంచి తాను రాజకీయాల్లో ఉన్నానని.. గెలిచినా, ఓడినా ప్రజల ప్రజల మధ్యే ఉన్నానని, ఎవరి వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసున్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న ప్రస్తుత ఎమ్మెల్యే అరాచకాలు నల్లగొండ నుంచి మొదలుకొని పక్క రాష్ట్రం గుంటూరు, పిడుగురాళ్ల వరకు తెలుసన్నారు. కరపత్రాల్లో, పత్రికల్లో, శిలాఫలాలపై పేర్ల కోసం పాకులాడే వ్యక్తిని తాను కాదన్నారు. నకిరేకల్ నియోజకవర్గ ప్రజల కలలను సాకారం చేసేలా అయిటిపాయిల ప్రాజెక్టు, వంద పడకల ఆస్పత్రిని తానే తీసుకొచ్చానని చిరుమర్తి తెలిపారు. ప్రస్తుత ఎమ్మెల్యే నకిరేకల్ నియోజకవర్గంలో ఉన్న వ్యాపారవేత్తలు, అధికారులను మామూళ్ల పేరిట పెడుతున్న ఇబ్బందుల గురించి జిల్లా మొత్తం కోడై కూస్తుందన్నారు. ఒత్తిడి తట్టుకోలేకే అధికారులు తప్పనిసరి పరిస్థితుల్లో తప్పులు చేస్తూ సస్పెండ్ అవుతున్నారన్నారు. మాట వినని అధికారులను బదిలీల పేరిట వేధింపులకు గురిచేస్తూ నియంతలా పాలిస్తున్నారని ఆరోపించారు. అభివృద్ధిపై ప్రజలతో రెఫరెండం నిర్వహిస్తే ఎవరికెన్ని ఓట్లు పడతాయో తేల్చుకుందామని ఎమ్మెల్యే వేముల వీరేశంకు సవాల్ విసిరారు.
మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య


