
బొమ్మలతో సులభంగా బోధించేలా..
హాజరుశాతం పెంచడమే లక్ష్యం
ఆలేరు: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా బోధనను సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషిచేస్తోంది. పాఠ్యాంశాలను బొమ్మలతో బోధించేందుకు గాను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ఉపాధ్యాయులకు జాతీయ స్థాయిలో దశలవారీగా ప్రత్యేక శిక్షణ ఇస్తోంది.
యాదాద్రి భువనగిరి నుంచి..
కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధీనంలోని సెంటర్ ఫర్ కల్చరల్ రీసోర్సెస్ అండ్ ట్రైనింగ్(సీసీఆర్‌టీ) ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీ నుంచి 24వ తేదీ వరకు న్యూఢిల్లీలో జరిగిన ఈ జాతీయ స్థాయి శిక్షణకు తెలంగాణ రాష్ట్రం నుంచి 9 మంది ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి ఆలేరు మండలం గొలనుకొండ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు ఏ. జ్యోతిర్మయి కూడా ఉన్నారు.
ఇతర రాష్ట్రాల బోధనా పద్ధతులపై శిక్షణ
ఈ జాతీయ స్థాయి శిక్షణలో దేశంలోని పలు రాష్ట్రాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఆయా రాష్ట్రాల్లో అమలు చేస్తున్న వినూత్న బోధనా పద్ధతులు, బొమ్మలతో బోధన, స్వయంగా బొమ్మల తయారీ గురించి నేర్చుకున్నట్లు ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి పేర్కొన్నారు. అంతేకాకుండా తెలంగాణ ఉద్యమం, ఉద్యమకారులు, చారిత్రాక కట్టడాలు, బోనాలు, బతుకమ్మ, ఇక్కడి విద్యా బోధన తీరు తదితర విషయాల గురించి ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులకు వివరించినట్లు ఆమె తెలిపారు. సీసీఆర్‌టీ సంచాలకులు రాజ్‌కుమార్ జ్యోతిర్మయికి ధ్రువపత్రాన్ని అందజేశారు.
ఫ జాతీయ స్థాయి శిక్షణలో పాల్గొన్న
గొలనుకొండ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జ్యోతిర్మయి
విద్యార్థులకు సులభంగా బొమ్మల ద్వారా పాఠాలు బోధించడం ఎలా అనేది జాతీయ స్థాయి శిక్షణలో నేర్పించారు. పాఠ్యాంశాల్లోని పాత్రల ప్రకారం స్వయంగా బొమ్మలు తయారు చేసుకోవడం కూడా తెలిసింది. ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులు అనుసరిస్తున్న వినూత్న బోధన పద్ధతుల గురించి తెలుసుకున్నాను. తెలంగాణలోని బోధన విధానాన్ని వేరే రాష్ట్రాల టీచర్లకు వివరించాను. శిక్షణలో భాగంగా రుద్రమదేవి వేషధారణతో పాఠ్యాంశం బోధించే అవకాశం నాకు దక్కింది. విద్యార్థుల్లో పాఠాలు వినాలనే ఆసక్తిని పెంపొందించి, తద్వారా సర్కారు బడుల్లో హాజరుశాతం పెంచడమే నా లక్ష్యం. త్వరలో జిల్లాలోని ఉపాధ్యాయులకు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బొమ్మలతో బోధనపై అవగాహన కల్పిస్తాను.
– ఏ. జ్యోతిర్మయి, ఉపాధ్యాయురాలు, గొలనుకొండ ప్రాథమిక పాఠశాల, ఆలేరు

బొమ్మలతో సులభంగా బోధించేలా..

బొమ్మలతో సులభంగా బోధించేలా..