
హైవేపై అదుపుతప్పిన యాసిడ్ ట్యాంకర్
చౌటుప్పల్: చౌటుప్పల్ పట్టణ కేంద్రంలో హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై మంగళవారం యాసిడ్ ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరువు పారిశ్రామికవాడ నుంచి మంగళవారం యాసిడ్‌ను లోడ్ చేసుకున్న ట్యాంకర్ ఏపీలోని పల్నాడు జిల్లా దాచేపల్లి ప్రాంతంలోని ఓ పరిశ్రమలో అన్‌లోడ్ చేసేందుకు బయల్దేరింది. సూర్యాపేట జిల్లా నేరేడుచర్లకు చెందిన ట్యాంకర్ డ్రైవర్ రాములు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో చౌటుప్పల్ పట్టణానికి చేరుకోగానే ముందున్న వాహనాల రద్దీని గుర్తించి బ్రేకులు వేసే ప్రయత్నం చేశాడు. ట్యాంకర్ వేగంతో ఉండడంతో బ్రేకులు పడలేదు. దీంతో చేసేదేమీ లేక ముందుకు వెళ్తే ప్రాణనష్టం జరుగుతుందన్న ఆలోచనతో ట్యాంకర్ డ్రైవర్ ఒక్కసారిగా ఎడమ వైపుకు తిప్పాడు. ఈ క్రమంలో ముందున్న రెండు కార్లను ఢీకొట్టాడు. హైవే వెంట ఏర్పాటు చేసిన ఇనుప గ్రిల్స్‌ను ఢీకొని సర్వీస్ రోడ్డులోకి వెళ్లి అక్కడ పార్కింగ్ చేసి ఉన్న రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడి ఆగిపోయింది.
క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్
ప్రమాద సమయంలో ట్యాంకర్‌లో డ్రైవర్‌తో పాటు నేరేడుచర్లకే చెందిన క్లీనర్ నవీన్ ఉన్నారు. డ్రైవర్ రాములకు తీవ్ర గాయాలై ట్యాంకర్ క్యాబిన్‌లో చిక్కుకున్నాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ట్రాఫిక్ పోలీసులు, స్థానికులు డ్రైవర్‌ను క్యాబిన్ నుంచి బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. యాసిడ్ ట్యాంకర్ రెండు తూఫాన్ వాహనాలపై బోల్తా పడడంతో పూర్తిగా నుజ్జునుజ్జయ్యాయి. ఒక్కో వాహనానికి రూ.11లక్షల చొప్పున నష్టపోయామని వాహనాల యజమానులు సిలివేరు శివ, కవిడె నర్సింహ బోరున విలపించారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ట్యాంకర్ బోల్తా పడిన సమయంలో అందులోని యాసిడ్ లీకై రోడ్డుపై పారింది.
తప్పిన ప్రాణనష్టం
ప్రమాదం జరిగిన సమయంలో తూఫాన్ వాహనంలో, వాహనాల పక్కన డ్రైవర్లు, స్థానికులు సుమారు 20మంది నిల్చున్నారు. ఈ ఘటన జరగడానికి రెండు నిమిషాల ముందే వారంతా అక్కడి నుంచి వెళ్లి సమీపంలోని దుకాణాల కూర్చున్నారు. లేదంటే భారీగా ప్రాణనష్టం జరిగేదని స్థానికులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఫ సర్వీస్ రోడ్డులో పార్కింగ్ చేసిన
వాహనాలపై బోల్తా
ఫ ట్యాంకర్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను బయటకు తీసిన పోలీసులు, స్థానికులు
ఫ ఆస్పత్రికి తరలింపు
ఫ చౌటుప్పల్ పట్టణంలో ఘటన