
వీధి వ్యాపారులకు చేయూత
మిర్యాలగూడ టౌన్ : మున్సిపాలిటీల్లో వీధి వ్యాపారులకు ఆర్థిక చేయూత అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త పథకం తీసుకొచ్చింది. కరోనా సమయంలో పీఎం స్వానిధి పథకం కింద చిరు వ్యాపారులకు రుణాలు అందించగా ప్రస్తుతం ఆ పథకాన్ని నిలిపివేసి చేసి దాని స్థానంలో లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకొచ్చారు. గతంలో రుణాలు పొందని చిరు వ్యాపారులకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేయనున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా) అధికారులు మున్సిపాలిటీల్లో లోక్ కల్యాణ్ మేళాలు ఏర్పాటు చేసి వీధి వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. అక్టోబర్ 2వ తేదీ లోగా ఆసక్తి గల వారి నుంచి దరఖాస్తులు స్వీకరించి రుణ మంజూరు కోసం బ్యాంకర్లకు అందజేయనున్నారు.
నిలిచిపోయిన పీఎం స్వనిధి పథకం..
ఐదేళ్ల క్రితం కరోనా కారణంగా వీధి వ్యాపారుల ఇబ్బందుల్లో పడ్డారు. కేంద్ర ప్రభుత్వం వారికి ఆర్థికంగా చేయూత అందించేందుకు పీఎం స్వానిధి పథకాన్ని ప్రారంభించింది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) ఆధ్వర్యంలో వీధి వ్యాపారుల సర్వే నిర్వహించి అర్హులైన వారిని గుర్తింపు కార్డులు అందించింది. మొదటి విడతలో రూ.10 వేలు, రెండో విడతలో రూ.20వేల వరకు రుణాలు అందించారు. తీసుకున్న రుణం తిరిగి చెల్లించిన వారికి రూ.50 వేల వరకు రుణాలు ఇచ్చారు. అయితే ఈ పథకం నిలిచిపోవడంతో గతంలో దరఖాస్తులు చేసుకున్న కొందరికి రుణాలు అందించలేదు. వారి కోసం లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకొచ్చింది.
రుణ సదుపాయం పెంపు
మిర్యాలగూడ మున్సిపాలిటీలో మొత్తం 10వేల మందికి పైగా వీధి వ్యాపారులు ఉన్నట్లు మెప్మా అధికారులు గుర్తించారు. వీరిలో 8893 మంది ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. పీఎం స్వానిధి పథకం కింద 5380 మంది గతంలో రుణాలు పొందారు. మిగిలిన వారికి రుణాలు మంజూరు కాలేదు. మరికొందరు రెండోసారి దరఖాస్తు చేసుకున్నప్పటికీ రుణం మంజూరు కాలేదు. బ్యాంకర్లు వివిధ కారణాలతో తిరస్కరించారు. కేంద్ర ప్రభుత్వం లోక్ కళ్యాణ్ పథకం తీసుకొచ్చి రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో మెప్మా అధికారులు మున్సిపాలిటీల్లో లోక్ కల్యాణ్ మేళాలు ఏర్పాటు చేసి కొత్తవారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. గతంలో రూ.10 వేలకు దరఖాస్తు చేసుకున్నవారికి రూ.15వేలు, రూ.15వేలకు దరఖాస్తులు చేసుకున్నవారికి రూ.25వేల వరకు రుణాలు ఇవ్వనున్నారు. అదేవిధంగా రూ.50వేల వరకు రుణాలు తీసుకునే ప్రతి ఒక్కరికి క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు. మున్సిపాలిటీ కార్యాలయంలో అక్టోబరు 2వ తేదీ వరకు కొత్తవారు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. నూతనంగా దరఖాస్తు చేసుకునే వారు వారి దుకాణానికి సంబంధించిన ఫొటో, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం జిరాక్స్‌లతో దరఖాస్తు చేసుకోవాలి.
ఫ ‘పీఎం స్వానిధి’ స్థానంలో లోక్ కల్యాణ్ పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం
ఫ గతంలో దరఖాస్తు చేసుకుని
రుణం పొందని వారికి
రుణ సదుపాయం పెంపు
ఫ కొత్తవారికీ అవకాశం
ఫ అక్టోబర్ 2 వరకు దరఖాస్తుల స్వీకరణ
ఫ లోక్ కళ్యాణ్ మేళాలు నిర్వహిస్తూ
అవగాహన కల్పిస్తున్న అధికారులు