
మాలల రణభేరిని విజయవంతం చేయాలి
సూర్యాపేట అర్బన్: ఎస్సీ వర్గీకరణలో తమకు జరిగిన అన్యాయంపై పోరాడేందుకు హైదరాబాద్‌లో నవంబర్ 2న నిర్వహించనున్న మాలల రణభేరి మహాసభను విజయవంతం చేయాలని మాలమహానాడు జాతీయ అధ్యక్షులు జి. చెన్నయ్య పిలుపునిచ్చారు. బుధవారం సూర్యాపేట పట్టణంలోని ఓ హోటల్‌లో ఏర్పాటు చేసిన సంఘం సమావేశంలో సూర్యాపేట జిల్లా మాలమహానాడు అధ్యక్షుడిగా పెన్‌పహాడ్ మండలం అనాజీపురం గ్రామానికి చెందిన బొల్లెద్దు వినయ్‌కి నియామకపత్రం అందజేశారు. అనంతరం చెన్నయ్య మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా 2011 జనాభా లెక్కలతో చేసిన ఎస్సీ వర్గీకరణను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కొత్తగా జనగణన చేపట్టకుండానే మాలలకు 5శాతం, మాదిగలకు 9శాతం రిజర్వేషన్ ఇచ్చి రోస్టర్ పాయింట్లు పెట్టడంతో మాలలు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. రోస్టర్ పాయింట్లను సవరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఎలాంటి ప్రయోజనం లేదని ఆరోపించారు. ఇటీవల ఆర్టీసీ ఉద్యోగాల్లో మాలలకు 28 పోస్టులుంటే మాదిగలకు 100 పోస్టులున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రోస్టర్ పాయింట్ల కేటాయింపును పునఃసమీక్షించి జీఓ 99ని సవరించి మాలలతో పాటు గ్రూప్–3లో ఉన్న మరో 25 కులాలకు న్యాయం చేయాలన్నారు. చేవెళ్ల డిక్లరేషన్ ప్రకారం ప్రస్తుతం జనాభాకు అనుగుణంగా ఎస్సీల రిజర్వేషన్ పెంచాలన్నారు. పెండింగ్‌లో ఉన్న ఎస్సీ విద్యార్థుల స్కాలర్‌షిప్స్ విడుదల చేయాలని, మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.1000 కోట్లు కేటాయించాలని, ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేసి నిధులు ఖర్చు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మాలల రణభేరి మహాసభకు మాల ప్రజాప్రతినిధులంతా హాజరుకావాలని లేని పక్షంలో వారి ఇళ్లు ముట్టడిస్తామన్నారు. మాలల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఎస్సీ వర్గీకరణ చేసి మాలలకు తీవ్ర అన్యాయం చేసిందని, మాలలకు అనుకూలంగా లేని ఏ పార్టీకై నా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. అనంతరం మాలల రణభేరి కరపత్రాలను ఆవిష్కరించారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన పంగరెక్క సంజయ్‌కి నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు బూర్గుల వెంకటేశ్వర్లు, మాల ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు పర్వి కోటేశ్వరరావు, నల్లగొండ జిల్లా అధ్యక్షులు లక్మాల మధుబాబు, ప్రకాష్, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చప్పిడి సావిత్రి, పాలపాటి సుమలత, యాదాద్రి జిల్లా మహిళా అధ్యక్షురాలు కె. లలిత, సమతా సైనిక్‌దళ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆల్క సైదులు పాల్గొన్నారు.
ఫ మాలమహానాడు జాతీయ అధ్యక్షులు
జి. చెన్నయ్య