తుర్కపల్లి: కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైన వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తుర్కపల్లి మండలం చిన్నలక్ష్మాపురం గ్రామంలో శుక్రవారం రాత్రి జరిగింది. శనివారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిన్నలక్ష్మాపురం గ్రామానికి చెందిన దుబాల శ్రీకాంత్‌రెడ్డి(40)కి భార్యతో పాటు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరు గ్రామంలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. కొంతకాలంగా వారి కుటుంబంలో కలహాలు జరుగుతున్నాయి. దీంతో మనస్తాపానికి గురైన శ్రీకాంత్‌రెడ్డి శుక్రవారం రాత్రి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లి చింత చెట్టుకు ఉరేసుకున్నాడు. శనివారం ఉదయం గ్రామస్తులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి దుబాల నరసింహారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తక్యుద్దీన్ తెలిపారు.