
ఆటోను ఢీకొట్టిన బొలేరో.. నలుగురికి గాయాలు
నాగార్జునసాగర్: ఆటోను బొలేరో వాహనం ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ఘటన గురువారం సాగర్ డ్యాం దిగువన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాగర్ డ్యాం దిగువన హిల్‌కాలనీ నుంచి పైలాన్ కాలనీకి వెళ్తున్న ఆటోను వెనుక నుంచి బొలేరో వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న బాలునాయక్, మల్లేశ్వరి, ఆటో డ్రైవర్ రవినాయక్‌తో పాటు విఘ్నేష్ అనే బాలుడికి దెబ్బలు తగిలాయి. సాగర్ ఎస్‌ఐ ముత్తయ్య ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వారిని నల్లగొండకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
తండ్రి, కుమార్తెకు..
ఆత్మకూరు(ఎం): రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తెకు గాయాలయ్యాయి. ఈ ఘటన ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలో గురువారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వలిగొండ మండలం తుర్కపల్లి గ్రామానికి చెందిన పారుపల్లి సోమయ్య, అతడి కుమార్తె రాణి బైక్‌పై గురువారం సాయంత్రం మోత్కూరుకు వెళ్తున్నారు. అదే సమయంలో పోసానికుంట నుంచి సామ రవీందర్‌రెడ్డి కారులో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రానికి వస్తున్నాడు. ఈ క్రమంలో ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో కారు, బైక్ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న పారుపల్లి సోమయ్య, అతడి కుమార్తె రాణి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 వాహనంలో భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ హనుమంతు తెలిపారు.
చికిత్స పొందుతూ మృతి
సూర్యాపేటటౌన్: రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెన్‌పహాడ్ మండలం పొట్లపహాడ్ గ్రామానికి చెందిన ఇరుగు రవీందర్(59) బుధవారం తన బైక్‌పై సూర్యాపేట నుంచి పెన్‌పహాడ్ వైపు వెళ్తుండగా.. సూర్యాపేట పట్టణంలోని శాంతినగర్ సమీపంలో ముందుగా వెళ్తున్న ఆటో డ్రైవర్ ఒక్కసారిగా ఆపడంతో వెనుక నుంచి బైక్‌తో ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో రవీందర్ తలకు బలమైన గాయమైంది. అతడిని సూర్యాపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పట్టణ సీఐ వెంకటయ్య తెలిపారు.
వాగులో కొట్టుకుపోయిన యువకుడు
బీబీనగర్: బీబీనగర్ మండలం గూడూరు పరిధిలో గురువారం చిన్నేటి వాగు దాటుతూ యువకుడు కొట్టుకుపోయాడు. స్థాని కుల వివరాల ప్రకారం.. మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా నాచారం ప్రాంతానికి చెందిన దండు నరేష్ గురువారం గూడూరు టోల్‌ప్లాజా సమీపంలో బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్ వద్ద చిన్నేటి వాగును చూసి.. బ్రిడ్జిపై నుంచి అవతలి వైపు దాటేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో నీటి తాకిడికి అదుపుతప్పి వాగులో కొట్టుకుపోయాడు. స్థానికుల సమాచారం మేరకు పోలీ సులు ఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. ఆర్డీఓ కృష్ణారెడ్డి, తహసీల్దార్ శ్యామ్‌సుందర్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించి గాలింపు చర్యలు ముమ్మరంగా చేపడుతున్నట్లు పేర్కొన్నారు.