గరిడేపల్లి: బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని లారీ ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన గరిడేపల్లి మండల కేంద్ర శివారులో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నేరేడుచర్ల మండలం ఫత్తేపురం గ్రామానికి చెందిన ఊరె శ్రీనివాస్(50) బుధవారంన అత్తగారి ఊరైన పొనుగోడు నుంచి ఫత్తేపురం గ్రామానికి బైక్‌పై వస్తుండగా.. గరిడేపల్లి మండల కేంద్రం శివారులోని ఎంవీఆర్ ఫంక్షన్‌హాల్ సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీనివాస్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపారు.
ఆర్టీసీ బస్సు ఢీకొని..
భువనగిరిటౌన్ : బైక్‌పై వెళ్తున్న గీత కార్మికుడిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో మృతిచెందాడు. ఈ ఘటన బుధవారం భువనగిరి పట్టణంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భువనగిరి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన గీత కార్మికుడు నారగోని బాలయ్యగౌడ్(56) బైక్‌పై భువనగిరికి వచ్చి పెట్రోల్ పోయించుకుని తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా.. భువనగిరి పట్టణంలోని నల్లగొండ రోడ్డుపై ఎదురుగా వస్తున్న నల్లగొండ డిపో బస్సు బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాలయ్యగౌడ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ ఇన్‌స్పెక్టర్ ఎం. రమేష్ తెలిపారు.