
రోడ్డు ప్రమాదంలో మహిళ దుర్మరణం
కొండమల్లేపల్లి: టీవీఎస్ ఎక్సెల్‌ను కారు ఢీకొన్న ఘటనలో మహిళ మృతిచెందింది. ఈ ఘటన కొండమల్లేపల్లి మండల కేంద్రంలో మంగళవారం జరిగింది. పెద్దఅడిశర్లపల్లి మండలానికి చెందిన సంకు లింగారెడ్డి తన అక్క పాశం విజయ(48)ను కొండమల్లేపల్లిలో హైదరాబాద్ బస్సు ఎక్కించడానికి టీవీఎస్ ఎక్సెల్‌పై వస్తుండగా.. కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి సమీపంలో చేరుకోగానే వెనుక నుంచి కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పాశం విజయను 108 వాహనంలో దేవరకొండ ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. లింగారెడ్డికి గాయాలు కాగా దేవరకొండలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మృతురాలి భర్త జైపాల్‌రెడ్డి హైదరాబాద్‌లో పెయింటింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ అజ్మీరా రమేష్ తెలిపారు.
గీత కార్మికుడికి తీవ్ర గాయాలు
రాజాపేట: ప్రమాదవశాత్తు తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన రాజాపేట మండలం బొందుగుల గ్రామంలో మంగళవారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బొందుగుల గ్రామానికి చెందిన గీత కార్మికుడు నర్మెట్ట శివ రోజుమాదిరిగా మంగళవారం సాయత్రం గ్రామ పరిధిలో తాటిచెట్టు ఎక్కి కల్లు గీస్తుండగా.. మోకు జారి చెట్టుపై నుంచి కిందపడ్డాడు. దీంతో శివకు తీవ్రగాయాలయ్యాయి. గ్రామస్తులు అతడిని చికిత్స నిమిత్తం ఆలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.