
కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
నల్లగొండ టూటౌన్: విద్యార్థులు పరిశోధనలు, కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. సోమవారం నల్ల గొండ జిల్లా కేంద్రం సమీపంలోని మహాత్మాగాంఽధీ యూనివర్సిటీలో జరిగిన 4వ స్నాతకోత్సవానికి గవర్నర్ ముఖ్యఅతిథిగా హాజరై 22 మందికి పీహెచ్‌డీ పట్టాలు, 57 మంది విద్యార్థులకు గోల్డ్ మెడల్స్ అందజేశారు. గవర్నర్‌కు నల్లగొండ కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్పీ శరత్‌చంద్ర పవార్, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, అదనపు కలెక్టర్లు జె. శ్రీనివాస్, నారాయణ అమిత్ పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. గవర్నర్ యూనివర్సిటీ ఇండోర్ స్టేడియం వద్ద మొక్క నాటి నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యా సంస్థలంటే సమాజానికి దార్శనికత, విలువలు నేర్పేందుకు రూపొందించబడిన జీవన వ్యవస్థలని అన్నారు. మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం విద్యతో పాటు పరిశోధనలు, ఆవిష్కరణలు, సేవా కార్యకలాపాల్లో అద్భుతమైన పురోగతి సాధిస్తూ విద్యార్థులను ఆకర్షిస్తుందని పేర్కొన్నారు. విద్యార్థుల హాజరును బలోపేతం చేయడం, హాస్టల్, క్యాంపస్ సౌకర్యాలను మెరుగుపరచడం, సమ్మిళిత అభ్యాస వాతావరణాన్ని పెంపొందించడంపై యూనివర్సిటీ చూపుతున్న శ్రద్ధ ప్రశంసలకు అర్హమైందన్నారు. యూనివర్సిటీని జాతీయ స్థాయి విద్యాసంస్థగా తీర్చిదిద్దడంలో పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్ పెంపొందించడం చాలా అవసరమన్నారు. దేశ పురోగతి ఆ దేశ మానవ ప్రతిభపై ఆధారపడి ఉంటుందని.. పరిశోధన, ఆవిష్కరణలు దీనికి కీలకమన్నారు. కోవిడ్–19 వ్యాక్సిన్ అభివృద్ధి మన దేశ సత్తాను ప్రపంచానికి చాటిందన్నారు. ప్రస్తుతం భారతదేశం బహుళ రంగాల్లో రాణిస్తోందని, యూనివర్సిటీలు యువ మనస్సులను సజనాత్మకత, ఆవిష్కరణలతో పెంపొందిస్తాయన్నారు. భారతదేశం త్వరలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడానికి సిద్ధంగా ఉందన్నారు. విద్యార్థులు పరిశ్రమలు నెలకొల్పేలా సిద్ధం చేయాలని కోరారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం చెప్పినట్లుగా కలలు కనండి.. కలలు ఆలోచనలుగా రూపాంతరం చెందుతాయి, ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయన్నారు. అదేవిధంగా ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి, యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ ఖాజా అల్తాఫ్ హుస్సేన్, రిజిస్ట్రార్ అల్వాల రవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ ఏడీసీ భవానీప్రసాద్, రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి దేవసేన, యూనివర్సిటీ అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు కుందూరు రఘువీర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్‌నాయక్ తదితరులు గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
ఎంజీయూ స్నాతకోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరు
పాల్గొన్న ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి

కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి

కొత్త ఆవిష్కరణలపై దృష్టి సారించాలి