
చోరీలకు పాల్పడుతున్న మల్టీపర్పస్ వర్కర్ అరెస్ట్
కోదాడరూరల్: ఆర్థిక ఇబ్బందుల కారణంగా చోరీలకు పాల్పడుతున్న గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్‌ను సోమవారం అనంతగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసు వివరాలను కోదాడ రూరల్ సీఐ కార్యాలయంలో డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి విలేకరులకు వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండల పరిధిలోని ఖానాపురం గ్రామానికి చెందిన బండ్ల భాస్కర్ గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్‌గా విధులు నిర్వహిస్తూ.. ఖాళీ సమయంలో తాపీ మేసీ్త్ర పనికి వెళ్తున్నాడు. ఏడాదిన్నర కిందట అతడి తల్లిదండ్రులు ఇద్దరూ అనారోగ్యం బారిన పడి నెల రోజుల వ్యవధిలో మృతిచెందారు. వారి వైద్యం కోసం, కుటుంబ పోషణ కోసం సుమారు రూ.8లక్షల వరకు అప్పులు తెచ్చాడు. పిల్లల చదువుల ఖర్చులు ఎక్కువ కావడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నాడు. దీంతో దొంగతనాలకు పాల్పడాలని నిర్ణయించుకున్నాడు. గ్రామ పంచాయతీ విధుల్లో భాగంగా ఉదయం వేళ గ్రామంలో తిరుగుతూ తాళం వేసిన ఇళ్లను గుర్తించి చోరీలకు పాల్పడేవాడు. ఏడాదిన్నర క్రితం ఖానాపురం గ్రామానికి చెందిన పిడమర్తి సుశీల ఇంట్లో, ఈ ఏడాది మార్చిలో తొర్రికొండ కృష్ణకుమారి, కొంగల గంగ ఇళ్లలో, ఆగస్టులో తోటి మల్టీపర్పస్ వర్కర్ గుండ్లపల్లి ఏడుకొండలు ఇంట్లో భాస్కర్ చోరీలకు పాల్పడి ఆరు తులాల బంగారు ఆభరణాలు, 180 గ్రాముల వెండి దొంగలించాడు. దొంగిలించిన బంగారంలో కొంత తాకట్టు పెట్టాడు. మిగిలిన బంగారాన్ని కూడా తాకట్టు పెట్టేందుకు సోమవారం కోదాడకు వెళ్తూ.. గ్రామంలో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులను చూసి పారిపోతుండగా పట్టుకున్నారు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా చేసిన నేరాలను ఒప్పుకున్నట్లు డీఎప్పీ తెలిపారు. అతడి నుంచి ఆరు తులాల బంగారం, 180 గ్రాముల వెండితో పాటు ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ తరలించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. నిందితుడిని పట్టుకున్న కోదాడ రూరల్ సీఐ ప్రతాప్ లింగం, అనంతగిరి పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ ఎం. నవీన్‌కుమార్, పోలీస్ సిబ్బంది రామారావు, నిరంజన్, ఏడుకొండలు, సీహెచ్. నరసింహరావును డీఎస్పీ శ్రీధర్‌రెడ్డి అభినందించారు.
తోటి సిబ్బంది ఇంట్లో కూడా
దొంగతనానికి పాల్పడిన వైనం
ఆరు తులాల బంగారం,
180 గ్రాముల వెండి స్వాధీనం