
మొర ఆలకించి.. వినతులు స్వీకరించి
అలైన్‌మెంట్ మార్చాలి
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి ప్రజలు తరలివచ్చి అర్జీలు అందజేశారు. అదనపు కలెక్టర్ వీరారెడ్డితో కలిసి కలెక్టర్ హనుమంతరావు వినతులు స్వీకరించారు. బాధితుల మొర ఆలకించారు. వినతులకు సత్వర పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు. మోత్కూరు మండలం దత్తప్పగూడేనికి చెందిన బాతుక ఐలమ్మ భర్త మల్లయ్య భూ భారతి రెవెన్యూ సదస్సులో పెట్టుకున్న దరఖాస్తును కలెక్టర్ అప్పటికప్పుడు పరిష్కరించారు.మొత్తం 54 అర్జీలు రాగా రెవెన్యూకు సంబంధించి 41 ఉన్నాయి. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ శోభారాణి, డీఆర్‌ఓ జయమ్మ, డీఆర్‌డీఓ నాగిరెడ్డి, హౌసింగ్ పీడీ విజయ్‌సింగ్ పాల్గొన్నారు.
● ఆలేరు మున్సిపాలిటీలో పరిధిలో దళితులకు ఇచ్చిన 2.20 ఎకరాల భూమి కొందరు ఆక్రమించుకొని ప్లాట్లు చేసి అమ్మకాలు చేస్తున్నారని, వెంటనే అడ్డుకోవాలని పట్టణానికి చెందిన పలువురు దళితులు వినతి పత్రం అందజేశారు.
● ఓటరు జాబితాలో మరణించిన వారి పేర్లను తొలగించలేదని, సవరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర కో అర్డినేటర్ ఎండీ షరీప్ వినతిపత్రం అందజేశారు.
సాక్షి,యాదాద్రి : రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ మార్చాలని కోరుతూ భూ నిర్వాసితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు.జీవనాధారమైన భూములు కోల్పోతున్నామని, ప్రజాప్రయోజనాలకని తరచూ భూములు తీసుకుంటే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేశారు. భూములు కోల్పోతున్నామన్న వేదనతో రాయగిరికి చెందిన ముగ్గురు రైతులు గుండె పోటుతో మరణించారని వాపోయారు. రీజినల్ రింగ్ రోడ్డును ఆపకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఫ ప్రజావాణిలో అర్జీలు స్వీకరించిన కలెక్టర్
ఫ అత్యధికంగా రెవెన్యూ సమస్యలపైనే..