
బానిసత్వంపై ప్రజా పోరాటం
● నిజాంకు వ్యతిరేకంగా సామాన్య జనం తిరుగుబాటు ● రజాకార్ల కాల్పుల్లో నేలకొరిగిన ఎందరో వీరులు
రజాకార్లకు ఎదురొడ్డి నిలిచిన గుండ్రాంపల్లి
చిట్యాల: రజాకార్లకు ఎదురొడ్డి పోరాటం చేసిన గ్రామంగా చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామం చరిత్రలో నిలిచిపోయింది. అప్పటి సూర్యాపేట తాలుకాలోని వర్ధమానుకోటకు చెందిన సయ్యద్ మక్బూల్ అనే వ్యక్తి తన అక్క నివాసముంటున్న గుండ్రాంపల్లి గ్రామానికి కుటుంబ సభ్యులతో కలిసి వలస వచ్చాడు. బతుకుదెరువు కోసం ఏపూరు గ్రామానికి చెందిన ఓ భూస్వామి వద్ద పనిలో చేరాడు. అనంతరం మక్బూల్ రజాకార్ల బృందంలో చేరి గుండ్రాంపల్లి కేంద్రంగా సాయుధ పోరాటంలో పాల్గొంటున్న వారిపై అరాచకాలకు పాల్పడటం మొదలుపెట్టాడు. మక్బూల్ అరాచకాలకు వ్యతిరేకంగా గుండ్రాంపల్లి కేంద్రంగా ఏపూరు, రెడ్డిబావి, సైదాబాద్, గుండ్లబావి, ఆరెగూడెం, పలివెల, వెలిమినేడు, పెద్దకాపర్తి, చిన్నకాపర్తి, ఎలికట్టె గ్రామాలకు చెందిన యువకులు దళాలుగా ఏర్పడ్డారు. వీరు రజాకార్లకు ఎదురొడ్డి దాడులు చేసేవారు. దీనిని సహించని మక్బూల్ తిరుగుబాటుదారులపై దాడులు చేశాడు. ఒకసారి అతడు 30మంది యువకులను బంధించి వారిని ఎడ్ల బండికి కట్టేసి గుండ్రాంపల్లి నడిబొడ్డున (నేడు ఏపూరు గ్రామానికి వెళ్లే దారిలోని కూడలి) బావిలో పడేసి సజీవ దహనం చేశాడు. ఈ ఘటనతో పలివెలకు చెందిన కొండవీటి గురున్నాథరెడ్డి నాయకత్వంలో మక్బూల్‌పై ఒకేసారి దళాలు దాడి చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. దీనిని గ్రహించి ఈ దాడి నుంచి మక్బూల్ తప్పించుకున్నాడు. మరోసారి వీరు జరిపిన దాడిలో మక్బూల్ చేయి విరగగా.. గుర్తుతెలియని ప్రదేశానికి వెళ్లిపోయాడు. కాని అతడి భార్య, కుమార్తె ప్రాణాలు కోల్పోయారు. అనంతరం మక్బూల్‌కు సహకరించిన వారి ఇళ్లపై దాడి చేసి వారిని చంపేశారు.
అమరవీరుల స్థూపం ఏర్పాటు..
నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయిన తర్వాత నాటి పోరాటంలో 30 మందిని బావిలో సజీవ దహనం చేసిన చోట 1992 జూన్ 4న సీపీఐ ఆధ్వర్యంలో అమరవీరుల స్థూపాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు విజయవాడ–హైదరాబాద్ హైవే విస్తరణలో భాగంగా ఈ స్థూపాన్ని తొలగించి ఏపూరుకు వెళ్లే దారిలో పునఃనిర్మించారు.
ఒకేరోజు 17మంది సజీవ దహనం
అర్వపల్లి: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో జాజిరెడ్డిగూడెం మండలం కాసర్లపహాడ్ గ్రామానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. నిజాం నవాబు ఆకృత్యాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్న 17మంది కాసర్లపహాడ్ గ్రామస్తులను ఒకేరోజు రజాకార్లు సజీవ దహనం చేశారు. ఈ ఘటన అప్పట్లో ఈ ప్రాంతంలో సంచలనం సృష్టించింది. రజాకార్లకు వ్యతిరేకంగా అప్పట్లో చిగుర్ల సోమయ్య, మాజీ సర్పంచ్ సిరికొండ నర్సయ్య దళ కమాండర్లుగా పోరాడారు. ఆ సమయంలో రజాకార్లు కాసర్లపహాడ్ గ్రామానికి వచ్చి బాకి ముత్తయ్య, వేముల దేవయ్య, వేముల అర్వపల్లి, వేముల నర్సయ్య, మచ్చ చినరామయ్య, మంచాల గోపయ్య, కాటెబోయిన నర్సయ్య, పిట్టల రామయ్య, వడ్డగాని నర్సయ్య, బరిశెట్టి పాపయ్య, నల్లు చంద్రారెడ్డి, బౌరోజు లక్ష్మీనారాయణ, బౌరోజు సత్తయ్య, దిర్శనపు రాజయ్య, చెరుకు ఈదయ్య, ముద్దెరబోయిన కొండయ్య, దిర్శనపు రంగయ్యను పట్టుకొని గ్రామ శివారులోని కొమ్మోనిబండపై పశువుల కొట్టంలో తాళ్లతో కట్టేసి వారిపై ఎండుగడ్డి వేసి సామూహికంగా సజీవ దహనం చేశారు. అర్వపల్లి, జాజిరెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన అనిరెడ్డి రాంరెడ్డి, పగిడిమర్రి జాను, రింగు హనుమయ్య, జోగు వెంకులు, రింగు వీరమల్లు నిజాం పోలీసుల చేతిలో అమరులయ్యారు. అమరుల జ్ఞాపకార్ధం కాసర్లపహడ్, అర్వపల్లిలో స్మారక స్థూపాలను నిర్మించారు.
చిట్యాల: గుండ్రాంపల్లిలోని అమరవీరుల స్థూపం

బానిసత్వంపై ప్రజా పోరాటం